ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణకు తెర
46 రోజులుగా కొనసాగిన ఎస్‌ఐఆర్ ప్రక్రియ
సెప్టెంబరు 16 వరకు అభ్యంతరాల స్వీకరణ
కరీంనగర్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ పత్రాల స్వీకరణ గడువు ముగిసింది. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి పత్రాలు సేకరించే ప్రక్రియ సోమవారంతో పూర్తయింది. సేకరించిన ఓటర్ల వివరాలను అర్ధరాత్రి వరకు బీఎల్‌వోలు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. జిల్లాలో మొత్తం 10,89, 090 మంది ఓటర్లు ఉండగా, అందులో వందశాతం ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను ఓటర్లకు పంపిణీ చేశారు.
చివరిరోజు డిజిటలైజేషన్‌తో బిజీబిజీ
ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తమ ఓటుహక్కు కోల్పోయే అవకాశం ఉందన్న ఆందోళనతో పలువురు ఓటర్లు ముందుగానే ఎన్యూమరేషన్ ఫామ్స్‌ను అన్ని వివరాలతో పూర్తిచేసి బీఎల్‌వోలకు అందజేశారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర కారణాలతో నివాసం ఉంటున్నవారు బోనాల పండుగ సందర్భంగా స్వస్థలాలకు రావడంతో తమఓటు వివరాలను నమోదు చేసుకున్నారు. చివరిరోజు కూడా బీఎల్‌వోలకు పెద్దసంఖ్యలో ఎన్యూమరేషన్ పత్రాలు అందాయి. ఒకవైపు ఫామ్స్ సేకరణ.. మరోవైపు వాటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో బీఎల్‌వోలు ఒత్తిడికి గురయ్యారు. గడువు ముగిసే సమయం సమీపిస్తుండడంతో చివరిరోజు రాత్రివరకూ డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగించారు.
46 రోజుల పాటు కొనసాగిన ప్రక్రియ
రాష్ట్రంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను తొలుత జూన్ 25 నుంచి జూలై 24వ తేదీ వరకు నిర్వహించాలని ఎ న్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈకాలంలో బీఎల్‌వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల నుంచి ఎన్యూమరేషన్ ఫామ్స్ స్వీకరించి డిజిటలైజ్ చేయాల్సి ఉంది. ప్రక్రియలో ఓటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడం, పలు ప్రాంతాల్లో ప్రక్రియ నెమ్మదిగా సాగడంతో తొలుత గడువును ఆగస్టు 3 వరకు పొడిగించారు. అయినా ప్రక్రియ ఆశించిన వేగంతో ముందుకు సాగకపోవడంతో ఎన్నికల సంఘం మరోసారి గడువు పొడిగించింది. ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల వరకు గడువు విధించింది. దీంతో మొత్తం 46 రోజుల పాటు కొనసాగిన ఎన్యూమరేషన్ ప్రక్రియకు సోమవారం తెరపడింది.
ఈనెల 17న డ్రాఫ్ట్ జాబితా
ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అధికారులు తదుపరిదశపై దృష్టి సారించనున్నారు. ఈనెల 17న డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రకటించనుండగా, ఓటర్లు ఈ జాబితాలో తమపేరు ఉందో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ జాబితాలో పేరు లేకపోయినా.. పేరు, చిరునామాలో లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉన్నా ఈనెల 17 నుంచి సెప్టెంబర్ 16వ తేదీ వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు సమర్పించేందుకు అవకాశం ఉంటుంది. అందిన ఫిర్యాదుల ఆధారంగా నోటీసులు జారీచేసి అక్టోబర్ 15వ తేదీ వరకు అధికారులు పరిశీలించి, అవసరమైన విచారణను పూర్తిచేసిన అనంతరం అక్టోబర్ 19న తుది ఓటరు జాబితా ప్రకటించనున్నారు. ఇక ఓటర్లంతా డ్రాఫ్ట్ జాబితా విడుదలయ్యే రోజును దృష్టిలో పెట్టుకుని తమపేరు, వివరాలను మరోసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కాగా సోమవారం సెలవు రోజు కావడంతో వివరాల నమోదులో ఆలస్యమైందని.. మంగళవారం పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.


