విద్యానగర్(కరీంనగర్): కోటిదేవుళ్లకు దీపం పెట్టినా.. గ్రామ దేవతలకు నైవేద్యం మరువని గడ్డ తెలంగాణ. ఆషాఢంలో పల్లె, పట్టణం బోనాల జాతరలతో హోరెత్తుతుంటాయి. డప్పుసప్పుళ్లు.. పోతరాజు విన్యాసాలు.. శివసత్తుల పూనకాలతో పల్లెలు మారుమోగుతుంటాయి. కోడిపెట్టలు, మేకపోతుల బలులతో గ్రామదేవతలను కొలుస్తుంటారు.
బోనం.. అనుబంధం
కొత్తకుండకు సున్నం.. పసుపు రాసి.. కుంకుమ అద్దుతారు. చందనం చల్లుతారు. వరి లేదా జొన్నన్నంతో నింపిన ఘటానికి మామిడాకులు, వేపరెమ్మలు కడతారు. దీపం వెలిగించటానికి అనుకూలంగా కుండపైన మట్టి మూకుడు పెడతారు. అలా ఘటాలను అలంకరించి.. నలుగురితో కలిసి వెళ్లి, అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు.
500 ఏళ్ల క్రితం
500 ఏళ్ల క్రితం మలేరియా వ్యాధితో ప్రాణాలు పోతున్న వేళ మందిని, పిల్లలను రక్షించేందుకు గ్రామదేవతలకు పెట్టిన తొలి బోనం ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. ఆషాఢమాసంలో జగన్మాతకు భక్తితో సమర్పించే భోజన నైవేద్యాలే బోనాలు. గ్రామదేవతలు మైసమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, రేణుక ఎల్లమ్మల రుణం తీర్చుకుంటారు.


