బాలుడిని కబళించిన డీజిల్‌ ట్యాంకర్‌ | - | Sakshi
Sakshi News home page

బాలుడిని కబళించిన డీజిల్‌ ట్యాంకర్‌

Jul 17 2026 3:16 AM | Updated on Jul 17 2026 3:16 AM

● స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి వస్తుండగా ఘటన

కోరుట్ల: అన్నతో కలిసి ఆనందంగా బయల్దేరిన బాలుడిని డీజిల్‌ ట్యాంకర్‌ కబళించిన సంఘటన పట్టణంలోని వేములవాడ రోడ్డులో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని వేములవాడరోడ్డులో నివాసముండే మగ్గిడి రవి, సుమ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు చాణక్య తన స్నేహితుడిని బస్టాండ్‌లో దింపేందుకు బయలుదేరగా.. చిన్న కుమారుడు జశ్వంత్‌ (13) కూడా వస్తానన్నాడు. ఇద్దరూ కలిసి ద్విచక్రవాహనంపై వెళ్లారు. స్నేహితుడిని బస్టాండ్‌లో దింపి తిరిగి ఇంటికి బయల్దేరారు. ఇంటి సమీపంలోకి రాగానే బైక్‌ వేగం తగ్గించారు. అదే సమయంలో కోరుట్ల వైపు నుంచి వేములవాడ వైపు వెళ్తున్న డీజిల్‌ ట్యాంకర్‌ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో జశ్వంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. చాణక్యకు తీవ్రగాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. జశ్వంత్‌ ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. మరికొన్ని నిమిషాల్లో బడికి వెళ్లేవాడివి.. అంతలోనే ఈ లోకాన్ని వీడావా కొడుకా అంటూ తల్లిదండ్రులు రోధించిన తీరు స్థానికులను కలచి వేసింది. బాలుడి తండ్రి రవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement