కరీంనగర్ జీజీహెచ్‌లో ఇష్టారాజ్యం హాజరు పట్టికలో సంతకం చేసి సీనియర్ డాక్టర్లు మాయం ఓపీలకు జూనియర్ వైద్యులే దిక్కు సర్కారు జీతం తీసుకుంటూ ప్రైవేటుగా ప్రాక్టీస్..! నెలరోజులుగా సెలవులో సూపరింటెండెంట్ కలెక్టర్ మందలింపే కారణమా?
1,063
1,127
1,112
1,528
1,284
1,039
జూలై10
జూలై13
జూలై7
ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేస్తున్న జూనియర్ డాక్టర్లు
జూలై11
జూలై 8
జూలై14
వైద్య వృత్తిలో కొనసాగేవారు అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వారు మరింత నిబద్ధతతో పనిచేయాలి. కరీంనగర్ జీజీహెచ్‌లో పనిచేసే సీనియర్ వైద్యులు మొక్కుబడిగా విధులకు హాజరవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉత్తర తెలంగాణలో పేద ప్రజలకు పెద్దదిక్కుగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారగా.. నెలకు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు సీనియర్ వైద్యులు.. ప్రభుత్వ విధులను గాలికొదిలేసి, ప్రైవేటు ప్రాక్టీస్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా 500 పడకలతో కొనసాగుతుండగా వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. – కరీంనగర్
ఆస్పత్రిలో విధులు నిర్వహించే సీనియర్ వైద్యుల తీరు ’వచ్చామా.. హాజరుపడ్డామా.. వెళ్లామా’ అన్నట్లుగా తయారైంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రావడం, హాజరు నమోదు చేసుకోవడం, తిరిగి ప్రైవేటు క్లినిక్ వైపో లేదా ఇళ్ల వైపో సర్దుకోవడం కొందరికి అలవాటుగా మారింది. రోగులకు వైద్యం అందించాల్సిన వారు గంట కూడా అందుబాటులో లేకపోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఓపీలకు సీనియర్ల డుమ్మా
జిల్లా నలుమూలల నుంచే కాకుండా పక్క జిల్లాల నుంచి ప్రతిరోజు 1,000 నుంచి 1,200 మందికి పైగా అవుట్‌పేషెంట్ (ఓపీ) సేవల కోసం వస్తుంటారు. ఓపీ విభాగాల్లో ఉండాల్సిన సీనియర్ వైద్యులు డుమ్మా కొడుతున్నారు. నిర్వహణ భారం సీనియర్ రెసిడెంట్లు, హౌస్‌సర్జన్లపైనే పడుతోంది. అనుభవజ్ఞులైన వైద్యులు లేకపోవడంతో, జూనియర్లకు అవగాహన లేక, తెలిసిన మందులు రాసి పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా రోజూ జరుగుతున్న తంతే కావడంతో, ప్రశ్నించే వారే లేరనే ధీమాతో కొందరు వైద్యులు వ్యవహరిస్తున్నారు.
వార్డుల్లో అధ్వానం
ఓపీ పరిస్థితి ఇలా ఉంటే, ఇన్‌పేషెంట్ వార్డుల పరిస్థితి అధ్వానంగా మారింది. వార్డుల్లో రోగులను పరిశీలించే నాథుడే కరువయ్యాడు. నర్సులు, జూనియర్ డాక్టర్ల భరోసాతోనే వార్డులు నడుస్తున్నాయి. సీనియర్ వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రాణభయంతో కొందరు మధ్యలోనే డిశ్చార్జ్ చేయించుకుని, అప్పులు చేసైనా వైద్యం చేయించుకుంటామని ప్రైవేటుకు పరుగుతీస్తున్నారు.
రాబోయేది జ్వరాల సీజన్
ఇది వర్షాకాలం.. వచ్చేది జ్వరాల సీజన్. డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌తో వందల సంఖ్యలో రోగులు ఆస్పత్రికి బారులుతీరే ప్రమా దం ఉంది. ప్రస్తుతం ఉన్న అరకొర సేవలకే రోగులు నరకం చూస్తుంటే, జ్వరాల సీజన్‌లో ఎవరు పట్టించుకుంటారని ఆందోళన చెందుతున్నారు. జిల్లా యంత్రాంగం, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి, విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
సూపరింటెండెంట్ లీవ్ వెనుక మతలబేంటి?
ఆసుపత్రి పరిపాలనను గాడిన పెడుతూ, వైద్యులను పర్యవేక్షించాల్సిన సూపరింటెండెంట్ నెల రోజులుగా సెలవులో ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆస్పత్రిలో జరుగుతున్న అవకతవకలపై గతంలో కలెక్టరేట్‌కు పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కలెక్టర్ సదరు అధికారిని మందలించారని, ఆ కారణంతోనే సుదీర్ఘ సెలవుపై వెళ్లారనే ప్రచారం సాగుతోంది. తను వ్యక్తిగత కారణాలతోనే లీవులో వెళ్లినట్లు, మరో రెండు రోజుల్లో విధుల్లో చేరుతానని సూపరింటెండెంట్ వివరించారు.


