ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి ఆలయంలో సోమవారం వేకువజామున అగ్నిగుండాల మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు భక్తులు పెద్దపట్నం ఉత్సవాలు తిలకించి జాగరణలో పాల్గొన్నారు. భక్తులు అగ్నిగుండాల నిప్పుకణికల్లో శరణు శరణు అంటూ నడిచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈవో సదయ్య, ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య ఏర్పాట్లు చేశారు.
టికెట్ తీసుకున్నా అగ్నిగుండాలు దాటనీయరా?
టికెట్ తీసుకున్నా ఓదెల మల్లన్న అగ్నిగుండాలు దాటనీయరా అంటూ ఆలయ సిబ్బందిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం వేకువజామున పలువురు భక్తులు అగ్నిగుండాలు దాటేందుకు రూ.200 వెచ్చించి టికెట్ తీసుకున్నారు. అగ్నిగుండాలు దాటేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ఉండడంతో అడ్డుకున్నారని, అక్రమంగా డబ్బు వసూలు చేశారని నిరసన వ్యక్తం చేశారు. కాగా, అగ్నిగుండాలు దాటే కార్యక్రమంలో శాంతి భద్రతల సమస్యలు ఎదురయ్యాయని ఈవో తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు అకస్మాత్తుగా రావడంతో ఇబ్బందులు తలెత్తి ఆపేసినట్లు పేర్కొన్నారు.


