జమ్మికుంట: రైలు కింద పడి గుర్తు తెలియని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ గంగారపు తిరుపతి వివరాల ప్రకారం మండలంలోని బిజిగిరిషరీఫ్, జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య దిగువ రైల్వేలైన్‌లో ఏపీ సంపర్క్ కాంత్రి ఎక్స్‌ప్రెస్ కింద పడి గుర్తుతెలియని(63) వృద్ధుడు సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు, అధారాలు లేవని, లేత పింక్ కలర్ టీషర్ట్, నలుపు రంగు నెక్కర్ ధరించాడన్నారు. మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, వివరాలు తెలిసిన వారు సెల్ నంబర్ 9949304574, 8712658604ను సంప్రదించాలని తెలిపారు.
బైక్ ఢీకొని వృద్ధుడు మృతి
పాలకుర్తి(రామగుండం): బసంత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధి మారేడుపల్లిలో సోమవారం బైక్ ఢీకొని గ్రామానికి చెందిన దర్శనాల మల్లయ్య(70) మృతిచెందాడు. ఎస్సై శ్రీధర్ తెలిపిన వివరాలు.. దర్శనాల లక్ష్మి–మల్లయ్య దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం మల్లయ్య తన భార్యను బైక్‌పై పొలం వద్ద దింపి రిటర్న్ తీసుకుంటుండగా బండారి పోచయ్య అనే ఉపాధ్యాయుడు వేగంగా వచ్చి బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో మల్లయ్య తలకు తీవ్ర గాయాలైనాయి. చికిత్స నిమిత్తం ధర్మారం ఆసుపత్రికి, పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ట్రాక్టర్ పై నుంచి పడి రైతు..
ఇల్లంతకుంట(మానకొండూర్): పొలం దున్ను తూ ట్రాక్టర్ పై నుంచి బురదలో పడిపోయి యువరైతు ఊపిరాడక మరణించాడు. ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ తెలిపిన వివరాలు. మండలంలోని రేపాకకు చెందిన రోండ్ల చంద్రశేఖర్‌రెడ్డి(25) తన వ్యవసాయ భూమిలో నాటు వేసేందుకు సోమవారం ట్రాక్టర్‌తో దున్నుతున్నాడు. ఈక్రమంలో ట్రాక్టర్‌పై నుంచి బురదలో పడిపోవడంతో ఊపిరాడకుండా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన తండ్రి మాధవరెడ్డి తన కొడుకును బయటకు తీసుకొచ్చి పరిశీలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
అద్దె బస్సు డ్రైవర్ తొలగింపు
సిరిసిల్ల అర్బన్: వేములవాడ అర్బన్ మండలం అనుపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక విచారణలో భాగంగా హైర్ బస్సు డ్రైవర్ ఎం.నరన్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రకాశ్‌రావు సోమవారం తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతిచెందారు. పలువురు కూలీలు గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటనపై టీజీఎస్‌ఆర్టీసీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తుందని ప్రకాష్‌రావు పేర్కొన్నారు.
ఆరురోజుల పాటు కూనారం రైల్వేగేటు మూసివేత
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి–కూనారం మార్గంలోని రైల్వే లెవల్ క్రాసింగ్ 39వ గేటు ప్రాంతంలో అత్యవసరంగా రైల్వే ట్రాక్ మరమ్మతు పనులను మంగళవారం నుంచి చేపడుతారు. ఈనెల 19 వరకు పనులు జరుగుతాయని, దీంతో పెద్దపల్లి–కూనారం రైల్వేగేటును ఆరురోజుల పాటు మూసి వేస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్న ప్రజలు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని, ఇందుకు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని పేర్కొన్నారు.


