కరీంనగర్‌టౌన్: కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రెగ్యులర్‌గా బడికి వెళ్లి చదువుకోనివారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ సిస్టమ్(టాస్) అండగా నిలుస్తోంది. బడికి వెళ్లకుండానే వారి పని, వృత్తులు చేసుకుంటూ నేరుగా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాసే అవకాశం కల్పిస్తోంది. 14 ఏళ్లు దాటినవారు టెన్త్, 15 ఏళ్లు దాటి 10వ తరగతి పాసైన వారు ఇంటర్ పరీక్షలకు హాజరుకావచ్చు. కారుణ్య నియమాకాలు, ఉద్యోగాల్లో పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి సార్వత్రిక విద్య ఓ వరం.
2008–09లో ప్రారంభం
సార్వత్రిక విద్యను ప్రభుత్వం 2008–09లో ప్రవేశపెట్టింది. మొదట్లో చదువు మధ్యలో మానేసిన వారికి పదో తరగతి చదివేందుకు అవకాశం ఉండేది. 2010–11 నుంచి ఇంటర్ విద్యకు అవకాశం కల్పించారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ కోసం 72 సెంటర్లు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు www. telagana openschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవ చ్చు. ఇందులో పాసయినవారికి సార్వత్రిక విద్యాపీఠం వారు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఇవి సాధారణ విద్యార్థులకిచ్చే సర్టిఫికెట్ల మాదిరిగానే పనిచేస్తాయి. ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. అపరాద రుసుంతో ఆగస్టు 28 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
పదో తరగతిలో ప్రవేశానికి..
సార్వత్రిక విద్యను అభ్యసించేందుకు 14 ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉన్నవారికి అవకాశం కల్పిస్తారు. పదో తరగతి చదవాలనుకున్న వారికి ఎలాంటి విద్యార్హత లేకున్నా ప్రవేశం పొందవచ్చు. వయసు నిర్ధారణకు తహసీల్దార్ లేదా మున్సిపాలిటీ అధికారులు జారీ చేసిన ధ్రువపత్రాలు ఉండాలి. గతంలో ప్రాథమిక పాఠశాలలో చేరిన వారు మధ్యలో బడి మానేస్తే అప్పటి బదిలీపత్రం, టీసీ, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు ఫొటోలతో ప్రవేశం పొందవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ వారికి టెన్త్‌కు రూ.150, అడ్మిషన్ ఫీజు 5 సబ్జెక్టులకు రూ.1,400, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ.200 చెల్లించాలి. రిజర్వ్‌డ్ కేటగిరివారికి అడ్మిషన్ ఫీజు రూ.1,000 ఉంటుంది.
ఇంటర్‌లో చేరాలంటే..
ఇంటర్ అడ్మిషన్‌కు 15 ఏళ్లు ఉండి పదో తరగతి పాసయినవారు అర్హులు. పదో తరగతి ఒరిజినల్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్, రెండు ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలి. సైన్స్ గ్రూపులు సైతం అందుబాటులో ఉన్నాయి. ఇంటర్‌కు జనరల్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.300, అడ్మిషన్ ఫీజు రూ.1,500, ప్రతి అదనపు సబ్జెక్టుకు రూ.300, రిజర్వ్‌డ్ కేటగిరి వారు అడ్మిషన్ ఫీజు రూ.1,200 చెల్లించాలి. స్టడీ సెంటర్లలో ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. మీసేవ ఆన్‌లైన్ రశీదు జత చేసి ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్ పరిశీలనకు నిర్ణీత సమయంలో పంపించాలి.
దూరవిద్యలో పది, ఇంటర్ చదివేందుకు అవకాశం
బడికి వెళ్లలేని వారికి సువర్ణావకాశం
ప్రారంభమైన అడ్మిషన్లు
ఈ నెల 28 వరకు దరఖాస్తుకు గడువు


