కరీంనగర్‌క్రైం: అప్పటివరకు అంతా బాగానే ఉంది.. ఉదయాన్నే గుడికి వెళ్లి వచ్చాడు. భార్యతో ‘టీ పెట్టు’ అని చెప్పి రెండో అంతస్తుకు వెళ్లాడు. టీ సిద్ధమైందని భార్య పిలిచింది. అతడి నుంచి సమాధానం లేదు. అనుమానంతో పైకి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కిందకు దించగా.. అప్పటికే ప్రాణాలు విడిచాడు. కరీంనగర్‌లో సోమవారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటన ఓ కుటుంబాన్ని తీవ్రశోకంలో ముంచింది. భగత్‌నగర్‌కు చెందిన కోడూరి సందీప్‌కుమార్(40) వ్యాపారం చేస్తుంటాడు. ఉదయం గుడికి వెళ్లొచ్చాడు. భార్య సమతను టీ పెట్టమని చెప్పి రెండో అంతస్తుకు వెళ్లాడు. టీ తయారు చేసి పిలిచినా స్పందించలేదు. పైకి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లో ఫ్యాన్‌కు బెడ్‌షీట్లతో ఉరివేసుకొని కనిపించాడు. సమత కేకలు విని ఇంట్లో అద్దెకు ఉంటున్న వారు, స్థానికులు అక్కడికి చేరుకున్నారు. ప్రాణం ఉందేమోనన్న ఆశతో కిందకు దించారు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. తండ్రి ఇక తిరిగిరాడన్న విషయం తెలియని ఇద్దరు చిన్నారులను చూసి కుటుంబసభ్యులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడి భార్య రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.
ఆ చీటీలో ‘రూ.4 లక్షలు’!
ఘటన అనంతరం లభించిన ఓ చీటీ కీలకంగా మారింది. అందులో ‘రామారావు దగ్గర రూ.4 లక్షలు’ అని రాసి, సందీప్‌కుమార్ సంతకం చేసినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆ రూ.4 లక్షలు ఎవరికి సంబంధించినవి? సందీప్‌కు రావాల్సినవా? ఆర్థిక లావాదేవీల్లో ఏమైనా వివాదాలు ఉన్నాయా? అనే అంశాలు విచారణలో తేలాల్సి ఉంది. సందీప్‌కుమార్ అప్పులు చేయడం, తనకు రావాల్సిన డబ్బులు చేతికి అందకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు మృతుడి భార్య వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరుపుతున్నట్లు సీఐ రాంచందర్‌రావు తెలిపారు.
గుడికి వెళ్లొచ్చిన కొద్దిసేపటికే వ్యాపారి బలవన్మరణం
ఇద్దరు చిన్నారులకు తీరని శోకం.. కుటుంబంలో విషాదం
అప్పుల ఒత్తిడే కారణమంటూ భార్య ఫిర్యాదు


