కరీంనగర్‌అర్బన్: జిల్లాలో భూముల సర్వే, రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శుక్రవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్డీవోలు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత శాఖల అధికారులతో సమీ క్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో చేపట్టిన భూముల సర్వే నంబర్లపై రీ–సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో మొత్తం 70 గ్రామాల్లో భూముల సర్వే నంబర్లపై సర్వే చేపడుతున్నామని, ఇప్పటికే ఏడు గ్రామాల్లో పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. సుమారు 94,637 ఎకరాల భూముల సర్వే చేపట్టనున్నట్లు వివరించారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి 10మంది బీఎల్‌వోలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి, పకడ్బందీగా ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలన్నారు. రెవెన్యూ సదస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఇందిరమ్మ, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని గృహ నిర్మాణశాఖ అధికారులను ఆదేశించారు. కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జలకుమారి పాల్గొన్నారు.


