రామగిరి: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలోని గోకుల్‌నగర్‌లో కోళ్లు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. గ్రామంలోని ఏరవేని శ్రీకాంత్‌కు చెందిన నాటుకోళ్లు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడడం ఆందోళనకు గురిచేసింది. స్థానికుల కథనం ప్రకారం.. శ్రీకాంత్ తన ఇంటివద్ద పెంచుకుంటున్న నాటుకోళ్లు ఒక్కసారిగా చనిపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు విషపూరిత మందు కలిపిన ఆహారం ఇచ్చి చంపినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ ఘటన వెనుక వ్యక్తిగత వైరం లేదా ఇతర కారణాలు ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. విచారణ జరపాలని గ్రామపెద్దలు అధికారులను కోరారు.
డి అడిక్షన్ సెంటర్‌కు తరలింపు
ఇబ్రహీంపట్నం(కోరుట్ల): ఇబ్రహీంపట్నం మండలకేంద్రానికి చెందిన పిట్ట సాయి ఓ ఇంట్లో చొరబడి కొట్టిన కేసులో అతడిని శుక్రవారం పట్టుకోగా మత్తులో ఉన్నట్లు గుర్తించామని ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. అతడికి ఆధునిక సాంకేతిక విధానంలో పరీక్షలు చేయగా గంజాయి సేవించినట్లు తేలింది. అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని కరీంనగర్‌లో డి అడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
సైబర్ వలలో చిక్కిన మహిళ
జమ్మికుంట: పార్ట్‌టైం ఉద్యోగం పేరిట సైబర్ క్రైం వలలో చిక్కి ఓ మహిళ రూ.60వేలు పోగొట్టుకుంది. టౌన్ సీఐ రామకృష్ణ వివరాల ప్రకారం.. మండలంలోని కోరపల్లి గ్రామపంచాయితీ పరిధిలోని కాపులపల్లి గ్రామానికి చెందిన పల్లె అంజలి మార్చి 10వ తేదీన ఇన్‌స్ట్రాగామ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ కోసం వెతికింది. జాబ్‌టాస్క్‌లు ఇచ్చి రివ్యూస్ ఎంటర్ చేసి పోస్టు చేయమని సైబర్ నేరగాళ్లు తెలపగా, మొదట రూ.200, మరోసారి రూ.20వేలు, చివరగా రూ.40వేలు ఫోన్ పే ద్వారా పంపించింది. మళ్లి డబ్బులు ఇవ్వాలని అడగగా మోసపోయినట్లు తెలుసుకొని, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
గంజాయి విక్రేత అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలో శుక్రవారం గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న వ్యక్తిని పట్టణ ఎస్సై సదాకర్ పట్టుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ ప్రాంతానికి చెందిన గౌస్‌ఖాన్ జగిత్యాల విద్యానగర్ బైపాస్‌రోడ్‌లో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారు. అతడి వద్ద 270 గ్రాముల గంజాయి లభ్యమైంది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


