కొత్తపల్లి చెరువుకు రూ.2.86 కోట్లు.. రేకుర్తి చెరువుకు రూ.1.80 కోట్లు
తీగలగుట్టపల్లి చెరువుకు రూ.1.10 కోట్లు మంజూరు
పూర్తయిన టెండర్ ప్రక్రియ
ఈనెల నాలుగో వారంలో పనులు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి
సాక్షిప్రతినిధి,కరీంనగర్:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రేకుర్తి, తీగలగుట్టపల్లి, కొత్తపల్లిలోని చెరువుల సుందరీకరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈనెల నాల్గో వారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ఆయా పనులు ప్రారంభించనున్నారు. ఆయా చెరువుల సుందరీకరణ, రక్షణ, నీటి నిర్వహణకు మొత్తం రూ.5.82 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అమృత్ 2.0లో భాగంగా కేంద్రం ఈ నిధులు విడుదల చేసింది. టెండర్ ప్రక్రియ సైతం పూర్తి చేశారు. కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు ఆయా పనులు ప్రారంభించాలని కోరుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈనెల 16,17,18వ తేదీల్లో పార్లమెంట్ సమావేశాలున్నాయని, సమావేశాలు ముగిసిన తర్వాత చెరువుల సుందరీకరణ పనులు ప్రారంభించేందుకు వస్తానని తెలిపారు.
● కొత్తపల్లి ఊర చెరువు అభివృద్ధికి రూ.2.86 కోట్లు మంజూరయ్యాయి. ఆయా నిధులతో చెరువు కట్ట బలోపేతం, రక్షణ చర్యలు, అందంగా తీర్చిదిద్దే పనులతోపాటు కాలుష్య నివారణ చర్యలు చేపడతారు. ఈ పనుల కోసం సుమారు రూ.2.25 కోట్ల వ్యయం అంచనా వేయగా, అదనంగా పన్నులు, సెస్సులు, కన్సల్టెన్సీ, ఇతర ఖర్చులతో మొత్తం వ్యయం రూ.2.86 కోట్లకు చేరుకుంది.
● తీగలగుట్టపల్లి మాలకుంట చెరువుల పునరుద్ధరణ పనులకు రూ.1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా చెరువుబండ్‌ను బలోపేతం చేయడం, స్టోన్ పిచింగ్, ఫిల్టర్ మీడియా, డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు. అదనంగా బండ్‌పై ఎంఎస్ రెయిలింగ్, చెరువు పరిసరాల్లో చైన్‌లింక్ మెష్ ఏర్పాటు వంటి రక్షణ చర్యలు చేపడతారు. అలాగే చెరువు చుట్టూ పచ్చదనం పెంపు కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ పనులకు సుమారు రూ.85.35 లక్షలు కేటాయించారు. ఇక ఇతర ఖర్చుల కింద సీనరేజ్ చార్జీలు, జీఎస్టీ, కన్సల్టెన్సీ ఫీజులు, ప్లాంట్ల కొనుగోలు, కాలుష్య నివారణ చర్యలు, అనివార్య ఖర్చులు కలిపి మరో రూ.24.64 లక్షలు కేటాయించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1.10 కోట్లుగా నిర్ణయించబడింది. పనులు పూర్తయిన తర్వాత చెరువు అందంగా మారడంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా మెరుగుపడనుంది.
● రేకుర్తి పెంటకమ్మ చెరువు అభివృద్ధికి సైతం పై పనుల కోసం రూ.1.80 కోట్లు మంజూరయ్యాయి. అదనంగా చెరువు పరిసరాల్లో పచ్చదనం పెంపు చర్యలు తీసుకోనున్నారు. నీటి నిల్వను కాపాడేందుకు ఆర్‌సీసీ ఓపెన్ డ్రెయిన్ నిర్మాణం చేపడతారు. మొత్తం పనుల ఖర్చు సుమారు రూ.1.36 కోట్లు ఉండగా, సీనరేజ్, జీఎస్టీ, కన్సల్టెన్సీ చార్జీలు, ఇతర అనుబంధ వ్యయాలు కలిపి మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.1.80 కోట్లకు చేరింది. ఈ అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ఆయా చెరువులు అందంగా మారడంతో పాటు నీటి సంరక్షణకు కూడా ఉపయోగపడుతుందని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ పేర్కొన్నారు.


