మూణ్నెళ్ల పరేషన్‌! | - | Sakshi
Sakshi News home page

మూణ్నెళ్ల పరేషన్‌!

Apr 12 2026 2:42 AM | Updated on Apr 12 2026 2:42 AM

మూణ్నెళ్ల పరేషన్‌!

ఇదేం బాధ

గిట్లయితే ఎట్లా

జిల్లాలో..

రేషన్‌ బియ్యం కోసం

కార్డుదారుల నిరీక్షణ

కరీంనగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఇష్టారాజ్యం

11వ తేదీ దాటినా మూవ్‌మెంట్‌ వైఫల్యం

మందకొడిగా సరఫరా.. కార్డుదారుల పడిగాపులు

కరీంనగర్‌అర్బన్‌: రేషన్‌ మూవ్‌మెంట్‌ ప్రహాసనంగా మారింది. కరీంనగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. సంచి తరుగు కలిపి రవాణా చేయాల్సి ఉండగా సదరు విధానానికి స్వస్తి పలికి డీలర్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు పుష్కలం. తనకు ఇక్కడ డ్యూటే ఇష్టం లేదంటూ మాటలు.. చేతల్లో మరో రకంగా వ్యవహరిస్తున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంగా రేషన్‌ దుకాణాలు మూసివేసి ఉండగా కార్డుదారులకు ఇబ్బందిగా మారింది. నగరంలో 60 రేషన్‌ షాపులుండగా కరీంనగర్‌ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచే అత్యధిక దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ, ‘నవ్విపోదురు గాక..‘ అన్నట్లుగా తయారైంది మూవ్‌మెంట్‌ దుస్థితి.

మూవ్‌మెంట్‌ ఇంకెప్పుడో..

నిర్దిష్ట గడువులోగా మూవ్‌మెంట్‌ చేయాల్సి ఉండగా డీలర్లు, కార్డుదారులకు పడిగాపులు, నిరీక్షణే ఎదురవుతోంది. 3 నెలల బియ్యమని ప్రభుత్వం ప్రకటించినప్పుడే తదనుగుణంగా ప్రణాళికతో సాగాల్సి ఉండగా దిద్దుబాటు చర్యలు లేకపోవడం విడ్డూరం. నగరంలోని వావిలాలపల్లి, గణేశ్‌నగర్‌, రేకుర్తి, విద్యానగర్‌, మంకమ్మతోట, రాంనగర్‌, పద్మనగర్‌, కోతిరాంపూర్‌, ఆటోనగర్‌, హౌజింగ్‌బోర్డు కాలనీ, కిసాన్‌నగర్‌, భాగ్యనగర్‌, మారుతినగర్‌ తదితర ప్రాంతాల్లోని సగానికి పైగా రేషన్‌ దుకాణాల్లో బియ్యం లేక మూసి ఉండటం ఆందోళనకర పరిణామం. మండుటెండలో కార్డుదారులు రేషన్‌ దుకాణం వైపు వెళ్లడం, మూసివేతతో నిరాశగా వెనుదిరగడం తంతుగా సాగుతోంది. ప్రభుత్వం వేసవి దృష్ట్యా మూడు నెలల బియ్యం పంపిణీ చేస్తుంటే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ తీరు మాత్రం విరుద్ధం.

11 దాటినా బియ్యమేవీ?

జిల్లాలో 3లక్షల కార్డుదారులుండగా 9లక్షలకు పైగా యూనిట్లున్నాయి. కరీంనగర్‌, హుజూరా బాద్‌, జమ్మికుంట, చొప్పదండి మండల స్థాయి నిల్వ కేంద్రాల ద్వారా రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తారు. అత్యధికంగా కరీంనగర్‌ పాయింట్‌ నుంచి 218 దుకాణాలుండగా మిగతావి హుజూ రాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి పరిధిలో ఉన్నా యి. అయితే 250 పైగా దుకాణాలకు పూర్తిస్థాయిలో బియ్యం రాకపోవడం గమనార్హం. కరీంనగర్‌తో పాటు చొప్పదండి, రామడుగు, గంగాధర ప్రాంతాల్లోని అత్యధిక దుకాణాలు బియ్యం కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే యూనిట్‌కు 6 కిలోలు.. 3 నెలలవి కావడంతో ఒక్కో యూనిట్‌కు 18కిలోలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో లారీ సామర్థ్యాన్ని బట్టి 150 నుంచి 320 క్వింటాళ్ల వరకు సరఫరా చేస్తోంది. ప్రస్తుత లెక్క ప్రకారం యూనిట్‌కు 18కిలోలు కాగా ఒక్కో దుకాణానికి గరిష్ఠంగా 350క్వింటాళ్ల వరకు అవసరం. ఈ లెక్కన ఒక దుకాణానికి సరఫరా చేయాలంలే రెండుసార్లు లారీ వెళ్లాల్సిందే. వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా లారీలు అరకొర మాత్రమే ఉండటం శోచనీయం. ఇలాగైతే ఈ నెలలో పంపిణీ కావడం అనుమానమే.

పాపం.. డీలర్లు, కార్డుదారులు

రేషన్‌ దుకాణాలకు బియ్యం ఆలస్యంగా వస్తుండటంతో డీలర్ల బాధ వర్ణనాతీతం. పండుగ లేదు.. శుభకార్యాలు లేకుండా రేషన్‌ దుకాణంలోనే కాలం గడుపుతున్నారు. కొంత బియ్యం ఒకసారి మరికొంత బియ్యం మరోసారి పంపిస్తుండటంతో సాధ్యమైనంత వరకు పంపిణీ చేస్తున్నా పూర్తిస్థాయిలో పంపిణీ జరగడం లేదు. దీంతో కమీషన్‌తోనే బతుకు వెళ్లదీయాల్సిన డీలర్లు గిట్టుబాటు కాక ఉస్సూరుమంటున్నారు. ఇక కార్డుదారులు బియ్యం కోసం దుకాణాల చుట్టూ తిరగడం ఆందోళనకర పరిణామం.

రేషన్‌ దుకాణంలో ఇచ్చేదే ఒక బియ్యం. ఆ బియ్యాన్ని తీసుకోవాలంటే రోజుల తరబడి దు కాణం చుట్టూ తిరుగుతున్న. మూవ్‌మెంట్‌ సమస్యని తిప్పుకుంటున్నారు. అధికారులు చొరవ చూపాలి. – రాకేశ్‌, కార్డుదారు, వావిలాలపల్లి

రేషన్‌ దుకాణానికి సన్నబియ్యం రావడంతో తీసుకుందామని వెళ్తే మూసివేసి ఉంటుంది. ఇంకా బియ్యం రాలేదని చెబుతుర్రు. రోజూ పనులు మానుకుని బియ్యం కోసమే తిరుగుడైతుంది.

– విజయ, కార్డుదారు, భగత్‌నగర్‌, కరీంనగర్‌

‘ఈ ఫొటోలో ఉన్నది కోతిరాంపూర్‌లోని మరో రేషన్‌ దుకాణం. బియ్యం వచ్చాయో లేదో కార్డుదారులు బారులు తీరగా రెండ్రోజుల్లోనే పంపిణీ పూర్తయింది. దీంతో కార్డుదారులు నిరాశతో వెనుదిరిగారు’.

గ్రామాలు: 318,

మొత్తం జనాభా: 10,09,234

రేషన్‌ కార్డులు: 3,04,201,

యూనిట్లు: 9,77,152

రేషన్‌ దుకాణాలు: 566

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement