‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్‌ విద్యార్థి ఆఖరి ఆడియో | Leaked audio surfaces after BDS student Nithin Raj's death | Sakshi
Sakshi News home page

‘అనుక్షణం అవమానమే’.. బీడీఎస్‌ విద్యార్థి ఆఖరి ఆడియో

Apr 12 2026 1:13 PM | Updated on Apr 12 2026 1:39 PM

Leaked audio surfaces after BDS student Nithin Raj's death

కన్నూర్: తమ కుమారుడు చక్కగా చదువుకుని, డాక్టర్ అవుతాడని ఆశపడిన ఆ పేద తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. విద్య బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే ఓ విద్యార్థి పాలిట శాపంగా మారారు. కేరళలోని కన్నూర్ డెంటల్ కాలేజీలో మొదటి సంవత్సరం బీడీఎస్ చదువుతున్న తిరువనంతపురానికి చెందిన నితిన్ రాజ్ మృతి రాష్ట్రవ్యాప్తంగా  కలకలం రేపుతోంది.

కుల వివక్ష, అధ్యాపకుల వేధింపులే తన కొడుకును బలి తీసుకున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తుండగా, ప్రాణాలు తీసుకునే ముందు నితిన్ రికార్డ్ చేసినట్టుగా భావిస్తున్న ఓ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, కంటతడి పెట్టిస్తోంది. నితిన్ తండ్రి వైఎల్ రాజన్  పెయింటింగ్ కార్మికుడు. ఎన్నో కష్టాలకోర్చి కొడుకును డెంటల్ కాలేజీలో చదివిస్తున్నాడు. అయితే క్యాంపస్ లోపల, బయట నితిన్ తీవ్రమైన కులపరమైన వివక్షను ఎదుర్కొన్నాడని, సీనియర్ల ర్యాగింగ్‌కు గురయ్యాడని ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని తల్లిదండ్రులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో కాలేజ్ లైబ్రరీ భవనం పైనుంచి కింద పడి నితిన్ రక్తపు మడుగులో కనిపించాడు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించే లోపే అతడు ప్రాణాలు విడిచాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యాజమాన్యం ఓరల్ పాథాలజీ విభాగాధిపతి డాక్టర్ కె. రామ్, డాక్టర్ సంగీతలను సస్పెండ్ చేసి విచారణ ప్రారంభించింది. తాజాగా లీకైన ఆడియోలో నితిన్ చెప్పిన విషయాలు కలవర పెట్టేలా ఉన్నాయి.

‘క్లాసులో అందరి ముందూ నన్ను ఇడియట్ అని అవమానించారు. ఇటీవల సర్జరీ అయిన మా అమ్మను కూడా చులకన చేస్తూ మాట్లాడారు. మూడు మార్కులు కట్ చేసి.. ‘వెళ్లి మీ అమ్మానాన్నలకు ఈ సర్ ప్రైజ్ ఇవ్వు’ అని హేళన చేశారు. ఎంత భరించాలో అంతా భరించాను, చివరికి కోపంతో ఎదురుతిరిగాను’ అని నితిన్ ఆ ఆడియోలో వాపోయాడు. క్యాంపస్ గేటు దాటితే కాళ్లు, చేతులు నరికేస్తామని టీచర్లు బెదిరించారని, డాక్టర్ సంగీత లాంటి వారు ఇదంతా చూస్తూ నిలబడ్డారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: న్యూజెర్సీలో కాల్పుల కలకలం.. ఒకరి మృతి

Advertisement
 
Advertisement
Advertisement