జ్యోతినగర్: ‘బిడ్డా వెంకటేశ్.. నేను వస్తున్నా.. ఎవుసం పనులు ఎట్లున్నయ్’ అని ఫోన్‌లో మాట్లాడి ఇంటినుంచి బయలు దేరిన కాసేపటికే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు మహంకాళి ఉరఫ్ గంగారపు కిష్టయ్య(71) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశ్‌నగర్ కు చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు కిష్టయ్య తన భార్య లక్ష్మితో కలిసి శుక్రవారం తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఎన్టీపీసీ సమీ ప మల్యాలపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి మూలమలుపు వద్దకు వెళ్లగానే బైక్ అదుపు తప్పి పోయాడు. తలకు హెల్మెట్ ఉడడంతో ఎవరికీ గాయాలు కాలేదు. ఇంతలో అదేమార్గంలో వస్తున్న మోహన్ అనే వ్యక్తి.. తన వాహనం ఆపి కిందపడిన కిష్టయ్యను రోడ్డుపక్కకు తీసుకెళ్తున్నాడు. ఈక్రమంలో అదేమార్గంలో వస్తున్న కారు, పాలవ్యాన్ డ్రైవర్లు వీరిని చూసి ఆగారు. కానీ, వాటివెనకాలే అతివేగంగా వస్తున్న ట్యాంకర్ కారును ఢీకొంది. ఆ వెంటనే కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతటితో ఆగని ట్యాంకర్ పాలవ్యాన్‌తోపాటు కిష్టయ్య, మోహన్‌ను ఢీకొంది. ఈ ఘటనలో కిష్టయ్య కాలు నుజ్జునుజ్జు అయి దుర్మరణం చెందాడు. మోహన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్న కిష్టయ్య అదేస్థలంలో ట్యాంకర్ రూపంలో మృతి చెందడం విషాదం నింపింది. స్వగ్రామానికి వస్తానని చెప్పిన తండ్రి కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుమారుడు వెంకటేశ్‌తోపాటు కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఎన్టీపీసీ ఎస్సై–2 లచ్చన్న, ఏఎస్సై బుచ్చిన్నాయుడు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
అదుపుతప్పి రోడ్డుపై పడిపోయిన రిటైర్డ్‌కార్మికుడు
హెల్మెట్ ధరించడంతో సురక్షితంగా బయటపడిన వైనం
రోడ్డు పక్కకు వెళ్తుండగా వేగంగా వచ్చిఢీకొన్న ట్యాంకర్
దుర్మరణం చెందిన కిష్టయ్య, గాయాలపాలైన మరో వ్యక్తి


