రామగుండం: అంతర్రాష్ట్ర గంజాయి సరఫరా ముఠాను పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి వివరాలను వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విపిన్‌కుమార్, వికాస్‌కుమార్, దీపక్‌తోపాటు మరోబాలుడు ముఠాగా ఏర్పడ్డారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో వీరికి గుర్తుతెలియని వ్యక్తి 20 కేజీల డ్రైగంజాయి అప్పగించాడు. అక్కడి నుంచి తిరునవంతపురం–కోర్భా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించి రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్సై సంధ్యారాణి తన సిబ్బందితో తనిఖీలు చేశారు. బ్యాగులు పట్టుకున్న నలుగురు యువకులను ప్రశ్నించి సోదా చేశారు. ఇందులో డ్రై గంజాయి కనిపించగా అదుపులోకి తీసుకొన్నారు. గంజాయి స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గంజాయి విలువ సుమారు రూ.పది లక్షలు ఉంటుందని అంచనా వేశారు. శనివారం ఇందితులను కోర్టులో హాజరుపరచనున్నారు. స్థానికంగా వీరికి ఉన్న నెట్‌వర్క్‌పై నిఘా పెట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఏసీపీ రమేశ్, ఎస్సై సంధ్యారాణి, పోలీసు సిబ్బంది ఉన్నారు.
రూ.10లక్షల విలువైన 20 కేజీల గంజాయి స్వాధీనం
వివరాలు వెల్లడించిన పెద్దపల్లి డీసీపీ భూక్యా రాంరెడ్డి


