Vemulawada: నమ్మించి గొంతు కోశాడు.. స్నేహితుడి దారుణహత్య | - | Sakshi
Sakshi News home page

Vemulawada: నమ్మించి గొంతు కోశాడు.. స్నేహితుడి దారుణహత్య

Feb 13 2024 12:22 AM | Updated on Feb 13 2024 1:00 PM

- - Sakshi

వేములవాడ: వాళ్లిద్దరు మంచి దోస్తులు.. ధర్మగుండం వద్ద డ్యూటీ చేయగా వచ్చిన డబ్బులు పంచుకుంటూ నిత్యం మద్యం తాగడం, దావత్‌ చేసుకోవడం వారి అలవాటు. కలిసే తిరుగుతారు.. కలిసే ఉంటారు.. కానీ అకస్మాత్తుగా వారిలో చిన్నచిన్న తిట్ల పురాణం, పాత కక్షలు మద్యం మత్తులో చెలరేగాయి. దీంతో దోస్తు అని చూడకుండా కత్తితో మెడకోసి దారుణంగా హత్య చేసిన ఘటన సోమవారం వేములవాడలో జరిగింది.

పట్టణంలోని ఓల్డ్‌ అర్బన్‌కాలనీకి చెందిన కురుకుంట్ల శ్రీధర్‌(26) హత్యకు గురయ్యాడు. మృతుడికి భార్య భాగ్యరేఖ అలియాస్‌ యామిని, మూడేళ్ల కుమారుడు సిద్ధార్థనందన్‌, తండ్రి శ్రీశైలం, తల్లి జ్యోతి ఉన్నారు. ఘటనా స్థలాన్ని ట్రైనీ ఎస్పీ రాహుల్‌రెడ్డి, డీఎస్పీ నాగేంద్రచారి, టౌన్‌ సీఐ కరుణాకర్‌ పరిశీలించారు. క్లూస్‌టీం విభాగం వివరాలు సేకరించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

బైక్‌పై తీసుకెళ్లి..
శ్రీధర్‌ హత్యపై కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం రాత్రి 10 గంటలకు ఇంటి వద్ద గద్దైపె కూర్చున్న శ్రీధర్‌ను అదే కాలనీకి చెందిన బాబు అనే వ్యక్తి బైక్‌పై తీసుకెళ్లాడు. అప్పటి నుంచి ఉదయం వరకు శ్రీధర్‌ ఇంటికి రాలేదు. సోమవారం ఉదయం 9.30 గంటలకు పోలీసులు వచ్చి శ్రీధర్‌ భార్యను జర్మనీ గెస్ట్‌హౌస్‌ ప్రాంతంలో హత్య జరిగిన ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ తన భర్త చనిపోయి ఉన్నాడని భార్య యామిని రోదిస్తూ తెలిపింది.

లొకేషన్‌ సర్చ్‌ చేశా..: యామిని
తన భర్త శ్రీధర్‌ ఎక్కడున్నా తెలిసేలా తన మొబైల్‌లో గూగుల్‌ లొకేషన్‌ మ్యాప్‌ సెట్‌ చేసి ఇచ్చాడని భార్య యామిని తెలిపింది. గతంలోనూ రెండు, మూడుసార్లు మద్యం మత్తులో ఎక్కడో పడుకుని ఉంటే తాను గూగుల్‌లో సర్చ్‌ చేశానని, ఆదివారం రాత్రి సైతం గూగుల్‌లో సర్చ్‌ చేయగా బైపాస్‌రోడ్డు ప్రాంతంలో ఉన్నట్లు తెలిసిందని భార్య చెబుతోంది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని, బైక్‌పై తీసుకెళ్లిన బాబుకు సైతం ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని తెలిపింది. తన భర్తను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నాడని రోదించింది. కేవలం మద్యం, గంజాయికి బానిసలైన వ్యక్తులే ఇలా చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

పాతకక్షలే హత్యకు కారణమా..?
వేములవాడ పట్టణంలోని ఓల్డ్‌ అర్బన్‌ కాలనీకి చెందిన కురుకుంట్ల శ్రీధర్‌ పాత కక్షలకే బలైనట్లు పోలీసులు భావిస్తున్నారు. గతంలో శ్రీధర్‌ తన మిత్రుడైన బాబు బైక్‌ను తగులబెట్టాడని, అప్పటి నుంచి కక్ష పెంచుకున్న బాబు ఎలాగైనా హతమార్చాలని ప్లాన్‌ వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే బాబును, అతడికి సహకరించిన మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా దోస్తునే చంపేశాడంటూ వేములవాడ పట్టణంలో ఈ దారుణహత్య కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement