కరీంనగర్ సిటీ: విద్యార్థులు, పరిశోధకులు పర్యావరణహితమైన పరిశోధనలు చేయాలని శాతవాహన యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఉమేశ్‌కుమార్ తెలిపారు. కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలోని రసాయనశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గ్రీన్ కెమిస్ట్రీ ఇన్ యాక్షన్ ట్రాన్స్‌ఫార్మింగ్ అప్లడ్ సైసెన్స్ ఇన్ బెటర్ టుమారో’ అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ అఫ్సారి ఉస్మాని ఆధ్వర్యంలో గురువారం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేశ్‌కుమార్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో గ్రీన్ కెమిస్ట్రీ ప్రాముఖ్యతను వివరించారు. శాస్త్రవేత్తలు పర్యావరణ హిత పరిశోధనలు చేయాలన్నారు. ఎస్‌యూ బోర్డ్ ఆఫ్ స్టడీస్, కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ సరసిజ మాట్లాడుతూ రసాయనశాస్త్రం పూర్వకాలం నుంచి మానవ జీవితంలో ముడిపడి ఉందన్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ ప్రొఫెసర్ డి.కాశీనాథ్, పెర్గుశ్యామ్ పర్యావరణ హితమైన రసాయన ప్రక్రియలు, సుస్థిర పరిశోధనల ప్రాముఖ్యతను వివరించారు.


