రూ.306 కోట్లు చెల్లించాలంటున్న సివిల్ సప్లయ్
సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
వెసులుబాటు ఇవ్వాలంటున్న మిల్లర్లు
చాలా వరకు మిల్లుల్లో ధాన్యం జీరో
ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు
కరీంనగర్ అర్బన్: సివిల్ సప్లయ్.. మిల్లర్ల మధ్య బియ్యం రగడ నెలకొంది. ఇచ్చిన ధాన్యాన్ని మరాడించకుండా బ్లాక్‌లో విక్రయించిన మిల్లర్లపై అధికారులు ఉక్కుపాదం మోపుతుండగా, నిబంధనల పేరుతో వేఽధించొద్దని రైస్‌మిల్లర్ల సంఘం డిమాండ్ చేస్తోంది. ఏళ్ల తరబడి ఽవేచిచూడటం ఇక ఉండదని, లెక్క ప్రకారమే బియ్యం లేదా కప్పం కట్టాల్సిందేనని యంత్రాంగం స్పష్టం చేస్తోంది. నిబంధనలు ఎత్తివేయాలని రెండు రోజుల క్రితం సమావేశం నిర్వహించిన మిల్లర్లు పాదయాత్రగా వచ్చి కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ క్రమంలో పౌరసరఫరాలసంస్థ, విజిలెన్స్ అండ్ టాస్క్‌ఫోర్స్ సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తూ మిల్లర్లపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. 2011 నుంచి ఏఏ మిల్లు ఎంత బకాయి ఉందో లెక్క తేల్చుతూ నోటీసులు జారీ చేస్తున్నారు. ఇటీవల రైస్‌మిల్లరు భార్య ఆత్మహత్య చేసుకోగా అధికారుల వేధింపులతోనే బలవన్మరణానికి పాల్పడిందని రైస్‌మిల్లర్ల సంఘం ఆరోపిస్తోంది. జిల్లాలో 18మిల్లులే నిజాయితీగా వ్యవహరిస్తుండగా 109 మిల్లులు అక్రమాలకు తెరలేపాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
బకాయిలు.. రూ.306.85కోట్లు
ప్రభుత్వమిచ్చిన ధాన్యాన్ని మరాడించి బియ్యంగా అందించడం రైస్‌మిల్లరు చేయాల్సిన ప్రక్రియ. కాగా ఇచ్చిన ధాన్యాన్ని బ్లాక్‌లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం గమనార్హం. 2012 నుంచి రూ.306కోట్లు బకాయిలుండటం దారుణ పరిణామం. 2011–12 నుంచి 2023–24 వరకు జిల్లాలో 109 రైస్ మిల్లర్లు డీఫాల్ట్ కాగా రూ.306.85కోట్ల విలువైన 82,191 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. డీఫాల్ట్ రైస్ మిల్లుల డైరెక్టర్లు, వాటాదారులు, వారి కుటుంబసభ్యులు లేదా లీజుదారుల పేరిట ఉన్న ఆస్తులపై ఎలాంటి లావాదేవీలు జరపొద్దని అడిషనల్ కలెక్టర్ ఇప్పటికే సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆస్తుల లావాదేవీలు జరిగే సమయంలో సివిల్ సప్లై వద్ద ఎలాంటి బకాయిలు లేవని కలెక్టర్ ద్వారా ఎన్‌వోసీ తీసుకొస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలని స్పష్టం చేశారు. విజిలెన్స్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు జిల్లా పౌరసరఫరాలశాఖ, పౌరసరఫరాల సంస్థ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపడుతున్నారు. బకాయిదారులకు 25శాతం జరిమానాతో పాటు 12శాతం వడ్డీ విధించగా 12మందిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు. 44మిల్లులపై పంచనామా నివేదికలు పూర్తయ్యాయని పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ మంగళారపు రజనీకాంత్ వెల్లడించారు.
జరిమానా, వడ్డీ తొలగించండి
మరాడించే ఇచ్చే బియ్యాన్ని సకాలంలో తీసుకోకపోగా వేధిస్తున్నారని మిల్లర్లు అంటున్నారు. డిఫాల్ట్ మిల్లర్లకు విధించిన 25శాతం పెనాల్టీ, 12శాతం వడ్డీని మాఫీ చేసి 4 వారాల్లో బియ్యం పెట్టి సివిల్ సప్లయ్ బాకీ తీర్చేందుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. అధిక విద్యుత్తు ఛార్జీలు, ధాన్యం ఇచ్చి నంత త్వరగా బియ్యం తీసుకోకపోవడం, ధాన్యం తరుగు, డ్యామేజ్ అవడం, నాణ్యత లేక నూకలు ఎక్కువగా రావడం వంటి తదితర కారణాలతో ఇండస్ట్రీ నష్టాల బాటలో ఉందని చెబుతున్నారు.
ప్రభుత్వ సొమ్ముతో ఇతర వ్యాపారాలు
జిల్లాలో సీఎంఆర్ అమ్ముకోవడం అనవాయితీగా సాగుతోంది. వచ్చిన సొమ్మును ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారని తెలుస్తోంది. ఎక్కువగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెడుతుండగా గ్రానైట్, హోటళ్లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేశారని సమాచారం. ప్రభుత్వమివ్వాల్సిన ఛార్జీలు లక్షల్లో ఉంటే రూ.కోట్ల విలువ గల ధాన్యాన్ని అమ్ముకోవడం విడ్డూరం. ఎవరిని వదిలేది లేదని, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బకాయిదారులు వ్యవహరించాలని అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ వివరించారు.
డిఫాల్ట్ మిల్లర్లను ఎవరిని వదలొద్దు. మెడలు వంచైనా బకాయిలు రాబట్టండి. అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు రాబట్టాల్సిందే.
– ఇటీవల కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య


