అయ్యో.. బిడ్డలారా.. | - | Sakshi
Sakshi News home page

అయ్యో.. బిడ్డలారా..

Jun 15 2023 12:28 PM | Updated on Jun 15 2023 12:43 PM

- - Sakshi

ఓదెల/వీణవంక/జమ్మికుంట: వేసవి సెలవుల కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మానేరువాగులో మునిగి మృత్యువాత పడడం స్థానికంగా విషాదం నింపింది. వీణవంక మండలం కొండపాక చెక్‌డ్యాం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి చెక్‌డ్యాం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మూడు గ్రామాల ప్రజలను కలచివేసింది. జమ్మికుంట మండలం తనుగులకు చెందిన జూపాక అశోక్‌, భాగ్యలక్ష్మి కూతురు సింధు, సాత్విక్‌ (13)సంతానం.

అదే గ్రామానికి చెందిన కాసర్ల సునీల్‌, వందనకు కూతురు నిత్య(12) కుమారుడు ధామన్‌ సంతానం. వేసవి సెలవుల కోసం మూడు రోజుల క్రితం కొండపాకలోని సంపత్‌ ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం కొండపాక శివారులోని చెక్‌డ్యాంలో స్నానం చేద్దామని వెళ్లారు. నిత్య, సాత్విక్‌ ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు.

చదువులో ఇద్దరూ ముందంజ..
సాత్విక్‌ తనుగుల ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదివి ఆరో తరగతి కోసం ఇటీవల జరిగిన సోషల్‌ వెల్ఫేర్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. నిత్య హుజూరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్‌లో ఏడో తరగతి చదువుతోది. ఇద్దరూ చదువులో చురుగ్గా ఉండేవాళ్లని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తహసీల్దార్‌ రాజయ్య, ఎస్సై శేఖర్‌రెడ్డి, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది రాజబాబు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు కృషి చేశారు. జమ్మికుంట మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సంతాపం
సాత్విక్‌, నిత్య మృతి చెందడంపై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్‌, సర్పంచ్‌ చిలుముల వసంత, ఎంపీటీసీ వాసాల నిరోష తదితరులు సంతాపం తెలిపారు.

డేంజర్‌గా జోన్‌గా మానేరు
పొత్కపల్లి వద్ద మానేరు వాగు డేంజర్‌జోన్‌గా మారింది. నెల రోజుల క్రితం ఇక్కడే ఓ చిన్నారి కూడా ఈతకోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఇద్దరు చనిపోయారు. పొత్కపల్లి మానేరు చుట్టు గ్రామాలైన వీణవంక, కోర్కల్‌, కొండపాక, మడక, కనగర్తి, మల్లారెడ్డిపల్లె, కల్లుపల్లె ప్రజలు మానేరులో ఈత కొట్టేందుకు వస్తుంటారు. మానేరులో చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో లోతైన గోతులు ఏర్పడ్డాయి.

అవి నీటితో నిండిపోవడంతో చిన్నారులకు లోతు తెలియక మునిగిపోతున్నారు. మే 22న జీలకుంటలో జరిగిన భూలక్ష్మి ఉత్సవాలకు వచ్చిన వరంగల్‌ జిల్లా టేకుమట్ల మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన పింగిళి సదాశివరెడ్డి(24) ఇక్కడే మృతిచెందాడు. నెల తిరగకముందే సాత్విక్‌, నిత్య మానేరులో మునిగి మృతిచెందారు. ప్రమాదాలు జరగకుండా మానేరు చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement