శంకరపట్నం: కస్టం మిల్లింగ్ రైస్ విధానంలో ప్రభుత్వ నిర్ణయాలు, జీవోలు మిల్లర్లకు గుదిబండగా మారాయని రారైస్ మిల్లర్ల అసోషియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గణపతిరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైస్‌మిల్ వ్యాపారి భార్య తణుకు స్వప్న సంతాప సభ మంగళవారం కొత్తగట్టులో జరిగింది. హాజరైన గణపతి రెడ్డి స్వప్న చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ధాన్యాన్ని బియ్యంగా మార్చే 25ఏళ్ల క్రితం నాటి ఒప్పందాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ సమయానికి తీసుకోకపోవడంతో వర్షాలకు ధాన్యం మొలకెత్తి మిల్లర్లు ఆర్థికంగా నష్ట పోయారన్నారు. మిల్లింగ్ వ్యవస్థను ప్రభుత్వం గడ్డు పరిస్థితికి తెచ్చిందని, గ్రానైట్, క్రషర్లకు సబ్సిడీ ఇస్తున్న విధంగా మిల్లర్లకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైస్‌మిల్లర్లకు జరుగుతున్న నష్టంపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు, బాదం ప్రవీణ్, నాగరాజు, శ్రీధర్, రమేశ్, వెంకట్‌రావు, గోవిందరావు పాల్గొన్నారు.


