కరీంనగర్‌లో అబార్షన్‌ల కలకలం

- - Sakshi

కరీంనగర్‌టౌన్‌: గర్భంతో ఉన్న తన కోడలుకు క్లినిక్‌ నిర్వాహకురాలు అబార్షన్‌ చేసిందంటూ అత్తామామలు ఆసుపత్రిలో గొడవకు దిగి, దాడిచేసిన ఘటన మంగళవారం కరీంనగర్‌లో కలకలం రేపింది. వివరాల్లోకెళితే... పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లికి చెందిన ఓ వివాహిత జ్యోతినగర్‌లోని ఓ క్లినిక్‌కు రాగా అత్తామామలు సైతం ఆమెను వెతుక్కుంటూ అక్కడికి చేరుకొని తన కోడలు గర్భం తీయించుకుందని గొడవకు దిగారు.

నిర్వాహకురాలితో పాటు కోడలి తల్లిపై కూడా ఆగ్రహం వ్యక్తం చేసి, దాడికి పాల్పడ్డారు. అయితే తనకు రక్తస్రావం అవుతుంటే చికిత్స చేయించుకునేందుకు వచ్చాను తప్ప.. అబార్షన్‌ చేయించుకోలేదని కోడలు చెప్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు జ్యోతినగర్‌ క్లినిక్‌ వెళ్లి ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

గతంలోనూ ఇలాంటి ఘటనలు
సదరు క్లినిక్‌పై 2019 నవంబర్‌ 7న వైద్యారోగ్యశాఖ అధికారులు దాడి చేసి అబార్షన్లు జరుగుతున్న విషయంపై ఆరా తీయగా, పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.నిర్వాహకురాలిపై కేసు నమోదు చేసి, క్లినిక్‌ను మూసివేశారు. తాజాగా మంగళవారం జరిగిన ఈ ఘటనతో మళ్లీ ఆ క్లినిక్‌లో విచ్చలవిడిగా అబార్షన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ట్రీట్‌మెంట్‌ చేయించుకునేందుకు నగరంలో ప్రముఖ గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ ధర్మారం మండలం నుంచి ప్రత్యేకంగా పేషెంట్‌ జ్యోతినగర్‌లో ఉన్న సాధారణ క్లినిక్‌కు వెళ్లడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Read latest Karimnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top