కామారెడ్డి టౌన్: యాసంగి సీజన్‌లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టేలా అధికారులు ప్రోత్సహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, నీటిపారుదల, ఉద్యాన శాఖల అధికారులతో యాసంగి పంటల ప్రణాళికపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల తగ్గుదల దృష్ట్యా రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి కాకుండా పెసర, మినుము, కందులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, చిరుధాన్యాలు, కూరగాయలు పండించేలా చైతన్యపరచాలన్నారు. గ్రామ, మండల స్థాయిలలో విస్తృతంగా సదస్సులు నిర్వహించి పంట మార్పిడి ప్రయోజనాలను వివరించాలని అధికారులను ఆదేశించారు. ఆయిల్‌పాం, కూరగాయల సాగుకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు అర్హులకు చేరేలా చూడాలన్నారు. పశుగ్రాసం కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతు బీమా పరిహారం మంజూరులో తహసీల్దార్లు ధ్రువీకరణ పత్రాలను ఆలస్యం చేయకుండా జారీ చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, డీఏవో మోహన్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి జ్యోతి, గిరిజన సంక్షేమ శాఖ అధికారి సౌజన్య, డీఆర్‌డీవో దామోదర్‌రెడ్డి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఏడీఏలు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు.
నీటి లభ్యతను బట్టి
సాగు ప్రణాళిక రూపొందించాలి
రైతులకు అవగాహన కల్పించాలి
అధికారులకు కలెక్టర్
ఆశిష్ సంగ్వాన్ ఆదేశం


