● ధ్వంసమైన ఎస్బీఐ ఏటీఎం
● అలారం మోగడంతో సీసీ కెమెరాతో
ఉడాయించిన దుండగుడు
● జిల్లా కేంద్రంలో ఘటన
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో చోరీ యత్నం కలకలం రేపింది. నగదు దోచుకెళ్లేందుకు వచ్చి యంత్రాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. అలారం మోగడంతో ఏమీ దొరక్క చివరకు సీసీ కెమెరాను ఎత్తుకెళ్లాడు. జేపీఎన్ రోడ్డులో ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో బుధవారం తెల్లవారుజామున సుమారు 1:06 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గుర్తుతెలియని ఓ దుండగుడు ఇనుప రాడ్డుతో ఏటీఎంలోకి చొరబడి నగదు ఉండే యంత్రం తలుపును బలవంతంగా పగులగొట్టి, లోపలి భాగాలను ధ్వంసం చేశాడు. అదే సమయంలో ఏటీఎంకు అనుసంధానమై ఉన్న ఈ–సర్వైలెన్స్ వ్యవస్థ ద్వారా అనుమానాస్పద కదలికలను గుర్తించిన సంబంధిత భద్రతా సిబ్బంది వెంటనే అలారం మోగించారు. పెద్ద శబ్దంతో సైరన్ మోగడంతో భయపడిన నిందితుడు..సాక్ష్యాలు దొరక్కుండా ఉండేందుకు సుమారు రూ. 4 వేల విలువైన సీసీటీవీ కెమెరాను తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. సంస్థ ఫీల్డ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రగడ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్లు సీఐ నరహరి తెలిపారు. గత 20 రోజుల క్రితమే గాంధారి మండల కేంద్రంలోని ఎస్బీఐ ఏటీఎంలో భారీ చోరీ ఘటన మరువకముందే జిల్లా కేంద్రంలో ఏటీఎం చోరీకి యత్నించడం కలకలం రేపుతుంది. దుండగులు ఏస్బీఐ ఏటీఎంలనే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడటం గమనార్హం.


