సిస్టంలో రికార్డు అవుతుంది
● విద్యుత్ ట్రిప్ అయితే
క్షణాల్లో సమాచారం
● సబ్‌స్టేషన్‌లలో
ఆర్‌టీఎఫ్‌ఎంఎస్ ఏర్పాటు
నిజాంసాగర్(జుక్కల్): విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు కారణాలను గుర్తించేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. విద్యుత్ సబ్‌స్టేషన్‌లలో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్‌టీఎఫ్‌ఎంఎస్) ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానంతో సబ్‌స్టేషన్‌తోపాటు ఆయా ఫీడర్లలో బ్రేక్‌డౌన్, ట్రిప్, ఎల్‌సీ వివరాలు నమోదు కానున్నాయి.
69 సబ్‌స్టేషన్‌లలో ఏర్పాటు
జిల్లాలో 1.19 లక్షల వ్యవసాయ, 2.8 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లతోపాటు పరిశ్రమల కనెక్షన్లు ఉన్నాయి. మొత్తం 139 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉండగా మహమ్మద్ నగర్, చిట్యాల, బోర్లం గ్రామాల్లో కొత్తగా మూడు సబ్‌స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఈ మూడు సబ్ స్టేషన్లతోపాటు 66 పాత సబ్‌స్టేషన్‌లలో ఆర్‌టీఎఫ్‌ఎంఎస్ ఏర్పాటు చేశారు. అయితే సబ్‌స్టేషన్‌లలో ఉన్న ఫీడర్ల వారీగా సింగిల్‌ఫేజ్, త్రీఫేజ్ కరెంట్ సరఫరాల్లో అంతరాయం కారణంగా రైతులు, గృహ విద్యుత్ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి గుట్టలు, వాగులు, వంకల మీదుగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. వానకాలంతోపాటు ఆకాల వర్షాలు, బలమైన ఈదురుగాలులకు చెట్లు విరిగిపడటం, స్తంభాలు నేలకొరగటం కారణంగా కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అంతేకాకుండా కరెంట్ సమస్య గుర్తింపునకు ట్రాన్స్‌కో సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. అయితే కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆర్‌టీఎఫ్‌ఎంఎస్ సిస్టం ద్వారా కరెంట్ సమస్యను సబ్‌స్టేషన్‌లోనే గుర్తించవచ్చు. సబ్‌స్టేషన్లల్లో సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి తేవడంతో ట్రాన్స్‌కో ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరెంట్ సమస్యను సకాలంలో గుర్తించడంతోపాటు త్వరగా పరిష్కరించే వీలు కలుగనున్నది.
మహమ్మద్ నగర్ సబ్‌స్టేషన్
కరెంట్ సరఫరాల్లో అంతరాయాన్ని క్షణాల్లో గుర్తించడానికి సబ్‌స్టేషన్లల్లో ఆర్‌టీఎఫ్‌ఎంఎస్ సిస్టం ఏర్పాటు చేస్తు న్నాం. 69 సబ్‌స్టేషన్లలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. సబ్‌స్టేషన్‌లో కరెంట్ అంతరాయానికి ప్లాన్డ్, అన్‌ప్లాన్డ్ సమస్యను గుర్తిస్తుంది.
– సాలియానాయక్, ట్రాన్స్‌కో ఎస్‌ఈ


