సదాశివనగర్(ఎల్లారెడ్డి): రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ సూచించారు. బుధవారం మండల కేంద్రంతో పాటు తిర్మన్‌పల్లిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రాల వద్ద రైతుల కోసం అన్ని వసతులు కల్పించామన్నారు. ఏడు రకాల వరి ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్ అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో విండో చైర్మన్ గాదారి శ్రీనివాస్‌రెడ్డి, విండో సీఈవో విఘ్నేశ్ గౌడ్, క్లస్టర్ అధికారి నగేశ్, విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.
● ఆవిష్కరించిన కేటీఆర్, గంప
కామారెడ్డి రూరల్: కామారెడ్డి మండలం క్యాసంపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ జానపద గాయకుడు సంగి రఘు తెలంగాణ తొలి సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై రూపొందించిన జానపద గీతాన్ని బుధవారం నర్సన్నపల్లి బైపాస్ వద్ద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు ఎం.కె. ముజీబుద్దీన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రఘును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో క్యాసంపల్లి సర్పంచ్ అడప శ్యామ్, బీఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గూడెం బాలరాజ్, పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు చెలిమెల భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని రెవెన్యూ అదనపు కలెక్టర్ వి. విక్టర్ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆజాద్ 138వ జయంతి సందర్భంగా బుధవారం జాతీయ మైనారిటీ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ విక్టర్.. ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రిగా విద్యా వ్యవస్థ విస్తరణకు, సమాన విద్యావకాశాల కల్పనకు ఆయన బలమైన పునాదులు వేశారని కొనియాడారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై. గిరి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ శశి కుమార్, టీజీవో కార్యదర్శి సాయిరెడ్డి, ఉర్దూ అధికారి అర్షద్ అలీ, జూనియర్ అసిస్టెంట్లు సాయిలు, సత్యం, డీఈవోలు ఇర్ఫాన్, ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రముఖ పుణ్యక్షేత్రాల దర్శనానికి కామారెడ్డి ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దినేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రత్యేక బస్సు ద్వారా భక్తులు కాణిపాకం, శ్రీపురం స్వర్ణ దేవాలయం, జోగులాంబ, కంచి కామాక్షి, అరుణాచలం క్షేత్రాలను దర్శించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ బస్సు 22న డిపో నుంచి బయలుదేరి, వివిధ క్షేత్రాల దర్శనం అనంతరం 26న తిరిగి కామారెడ్డికి చేరుకుంటుందని వివరించారు. టికెట్ ధర పెద్దలకు రూ. 5 వేలు, పిల్లలకు రూ. 4 వేలుగా నిర్ణయించామన్నారు. కనీసం 30 మంది ప్రయాణికులు గ్రూప్‌గా ఉంటే, వారు కోరిన ప్రాంతానికే బస్సును పంపించే ప్రత్యేక సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీట్ల రిజర్వేషన్, ఇతర వివరాలకోసం 99592 26018, 73828 51280 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.


