ఏర్పాట్లు పూర్తి చేశాం
● రేపటి నుంచి 70వ తెలంగాణ
రాష్ట్రస్థాయి హాకీ పోటీలు
● టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర
పాఠశాలలో నిర్వహణ
బీబీపేట: రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు బీబీపేట టీఎస్‌ఎన్‌ఆర్ బాలుర ఉన్నత పాఠశాల సిద్ధమవుతోంది. 70వ తెలంగాణ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల హాకీ టోర్నమెంట్ (అండర్–14 బాలికల విభాగం)ను జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 13 నుంచి 15వ తేదీ వరకు మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ పోటీలకు రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల క్రీడాకారులు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో ఎస్‌జీఎఫ్ ఏర్పాట్లు పూర్తి చేసింది.
200 మంది క్రీడాకారులు..
రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో రాష్ట్రంలోని ఒక్కో ఉమ్మడి జిల్లా నుంచి 18 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. టోర్నీ సందర్భంగా 15 మంది పీఈటీలు, 18 మంది నిర్వాహకులు, అదనంగా ప్రతి జిల్లా నుంచి ముగ్గురిని నియమించారు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు బీబీపేటకు చేరుకొని ప్రాక్టీసు మొదలుపెట్టారు. స్టేట్ అబ్జర్వర్‌గా నిరంజన్‌గౌడ్‌ను నియమించారు. హాకీ టోర్నీ నేపథ్యంలో భోజనం, వసతి, లైటింగ్, గ్రౌండ్ తదితర సౌకర్యాలను పాఠశాల నిర్మాణదాత తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి కల్పిస్తున్నట్లు హెచ్‌ఎం మూల రవీంద్రారెడ్డి తెలిపారు.
టోర్నీ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేశాం. విద్యార్థినుల్లో క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్యకరమైన పోటీ తత్వాన్ని పెంపొందించడం, గ్రామీణ ప్రాంత ప్రతిభను వెలికితీయడమే ఈ పోటీల ముఖ్య ఉద్దేశం. తల్లిదండ్రులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ క్రీడా సంబురాన్ని విజయవంతం చేయాలి.
– శ్రీధర్, జిల్లా కార్యదర్శి,
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, కామారెడ్డి


