● జిల్లాలో 790 చెరువులు ఎంపిక
● 2.86 కోట్ల చేపపిల్లల విడుదల లక్ష్యం
● పూర్తయిన టెండర్ల ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : జిల్లాలోని ఎంపిక చేసిన చెరువుల్లోకి చేప పిల్లలు రానున్నాయి. అవి పెరిగి పెద్దయ్యాక మత్స్యకారులు పట్టి అమ్ముకొని ఉపాధి పొందాలని ప్రభుత్వం చేపపిల్లలను అందజేస్తోంది. ఈ ఏడాది జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అధికారులు 790 చెరువులను ఎంపిక చేశారు. దాదాపు 2.86 కోట్ల చేప పిల్లల్ని చెరువుల్లో వదలాలన్న లక్ష్యంగా టెండర్లు ఆహ్వానించగా, తక్కువ ధరకు కోట్ చేసిన కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసినట్లు మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తవ్వడంతో చేపపిల్లలను పంపిణీ చేయడానికి అధికారులు చర్యలు మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా చేపట్టే చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొంటారు. కాగా, ఎప్పుడు ప్రారంభిస్తారన్నదానిపై క్లారిటీ రాలేదు.
రెండు సైజుల్లో..
జిల్లాలో పంపిణీ చేసే చేపపిల్లలు రెండు సైజుల్లో ఉంటాయి. 80 మి.మీ.ల నుంచి 100 మిల్లీమీటర్ల సైజులో ఉన్న చేపలు కోటీ 40 లక్షలు పంపిణీ చేస్తారు. ఒక్కో చేప పిల్ల ధర రూ.1.65 కాగా, 35 మి.మీ. నుంచి 40 మి.మీ.ల సైజు ఉన్న చేపపిల్లలు కోటీ 46 లక్షలు పంపిణీ చేయనున్నారు. ఒక్కో చేపపిల్ల ధర 68 పైసలు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ లెక్కన 2.86 కోట్ల చేపపిల్లలకు రూ.3.30 కోట్లు ఖర్చవుతాయి.
మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు చెరువుల విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం చేప పిల్లల్ని అందజేస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని ఎంపిక చేసిన చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేసేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
చేపపిల్లల సరఫరా కాంట్రాక్టు పొందిన గుత్తేదారులు చెప్పిందే లెక్కగా ఉంటోంది. ఏ బుట్టలో ఎన్ని చేపలున్నాయన్న దానిపై మత్స్యకారుల కళ్లు కప్పేయడం ఏటా జరుగుతున్నదే. మత్స్యశాఖ అధికారులు, గుత్తేదారులు కుమ్మకై ్క చేపపిల్లల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారన్న ఆరోపణలున్నాయి. సైజు విషయంలోనూ అనేక పొరపాట్లు జరుగుతున్నాయి. టెండర్‌లో పేర్కొన్న సైజుల్లో చేపపిల్లల్ని సరఫరా చేయకుండా చిన్న సైజువి సరఫరా చేసిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో మత్స్యకారులు ఆందోళనలు కూడా చేశారు. పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో చేపపిల్లల సైజు, సంఖ్యపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది.


