సుభాష్‌నగర్: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ (ఎన్‌డీసీసీబీ)లో రూ.100 కోట్ల డిపాజిట్ల మైలురాయిని అధిగమించామని బ్యాంకు సీఈఓ నాగభూషణం వందే తెలిపారు. ఈసందర్భంగా నగరంలోని ఎన్‌డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఒకే బ్రాంచ్‌లో ఇన్ని డిపాజిట్లు రావడం ఎన్‌డీసీసీబీ చరిత్రలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. ఈ విజయానికి సహకరించిన ప్రధాన కార్యాలయ సిబ్బంది, అధికారులు, ఖాతాదారులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో బ్యాంకులోని అన్ని శాఖలు డిపాజిట్ల సమీకరణకు మరింత ప్రాధాన్యతనిస్తూ, తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రస్తుతం బ్యాంకు అందిస్తున్న ‘సంపద’ డిపాజిట్ పథకం ద్వారా సాధారణ ఖాతాదారులకు 8శాతం, సీనియర్ సిటిజన్లకు 8.5శాతం వడ్డీ అందిస్తున్నామని, ఈ పథకాన్ని ప్రజలకు విస్తృతంగా తెలియజేసి సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. కార్యక్రమంలో బ్యాంకు ఉన్నతాధికారులు లింబాద్రి, అనుపమ, సుమమాల, ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


