ఎల్లారెడ్డి: వడ్ల లోడ్‌తో వెళ్తున్న లారీని అడ్డగించి రూ.లక్ష 20వేలు డిమాండ్ చేసిన నలుగురు విలేకరులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు సోమవారం తెలిపారు. వివరాలు ఇలా.. మెదక్ జిల్లా శంకరంపేట చకినాల సురేందర్‌కు చెందిన వడ్లలోడ్ లారీ శనివారం రాత్రి ఎల్లారెడ్డి మీదుగా హైదరాబాద్‌కు వెళ్తుండగా నలుగురు వ్యక్తులు మల్లయ్యపల్లి గ్రామ శివారులో అడ్డగించి, తాము విలేకరులమని చెప్పి లారీ డ్రైవర్‌ను వడ్లకు సంబంధించిన పత్రాలు చూపించాలన్నారు. పత్రాలు చూపించకపోతే రూ.1.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు అటుగా రాగా బాధితుడు వారికి ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్‌ను బెదిరించిన మహమ్మద్ అబ్దుల్ మోసిన్, ఎడ్ల మహేష్ కుమార్, బుద్దే ఆనంద్, గాండ్ల సుధీర్ కుమార్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి కారు, 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. సీఐ రాజిరెడ్డి, ఎస్సై రాజు, పోలీసు సిబ్బంది ఇద్రీస్ తదితరులున్నారు.


