నాగిరెడ్డిపేట: పోచారం ప్రాజెక్టు వద్ద పర్యాటకుల సౌకర్యార్థం చేపట్టాల్సిన పనుల నిర్వహకు 15 రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఇరిగేషన్ ఈఈ వెంకటేశ్వర్లు తెలిపారు. పర్యాటక పనుల కోసం సోమవారం స్థానిక ఇరిగేషన్ అధికారులు, టూరిజం కన్సల్టెంట్ సిబ్బందితో కలిసి ఆయన ప్రాజెక్టును సోమవారం సందర్శించారు. అనంతరం ఇరిగేషన్ కార్యాలయంలో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్‌రావు కృషితో రూ.3 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. అథితి గృహానికి మరమ్మతులు చేపట్టడంతోపాటు గెస్ట్‌హౌస్ వద్ద టాయ్‌లెట్స్, పిల్లలు ఆడుకునేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించడం తదితర పనులు చేపడతామన్నారు. డ్యాం రీహబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాజెక్టు(డ్రిప్)–3 ద్వారా ప్రాజెక్టు వద్దనున్న గెస్ట్‌హస్‌కు వెళ్లే వంతెన మరమ్మతులు, సోలార్ లైట్ల ఏర్పాటు, మట్టికట్టపై పారఫీట్ వాల్ నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించామని వివరించారు. ఆయన వెంట ఇరిగేషన్ డీఈఈ కిష్టయ్య, ఏఈ అక్షయ్‌కుమార్, టూరిజం కన్సల్టెంట్ స్వాతిరెడ్డి తదితరులున్నారు.


