జిల్లాలో అధికారికంగా నమోదైన డెంగీ కేసుల వివరాలు
కామారెడ్డి టౌన్ : జిల్లాలో డెంగీ మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ప్రజలు విషజ్వరాలతో అల్లాడిపోతున్నారు. వాతవరణంలో మార్పులు, పారిశుద్ధ్య లోపం, చెత్తాచెదారంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఇళ్లలోని కుటుంబాలకు కుటుంబాలే మంచాన పడుతున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి.
పడిపోతున్న ప్లేట్‌లెట్స్..
గడిచిన నెల రోజుల్లో అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 15 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయి తే, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వంతోపాటు ప్రయివేటు ఆస్పత్రులు, క్లినిక్‌లలో వందలాది మంది డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. జ్వరం, ఒళ్లు నొప్పులు, ప్లేట్‌లెట్లు పడిపోవడంతో రో గులు బెంబేలెత్తుతున్నారు. ఇదే అదనుగా ప్రయివే టు ఆస్పత్రులు రక్త పరీక్షలు, సైలెన్ల పేరిట వేలల్లో ఫీజులు దండుకుంటూ సామాన్యుల జేబులకు చి ల్లులు పెడుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)తోపాటు, జిల్లాలోని రెండు ఏరియా ఆస్పత్రులు, ఏడు సీహెచ్‌సీలు, 19 పీహెచ్‌సీలు, రెండు అర్బన్ పీహెచ్‌సీలలో నిత్యం వందల సంఖ్యలో జ్వర బాధితులు వైద్యం కోసం వస్తున్నారు. ఒక్క జీజీహెచ్‌లోనే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు 60కిపైగా జ్వరబాధితులు అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నారు.
కానరాని పారిశుద్ధ్య చర్యలు
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణ గాడితప్పింది. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు సక్రమంగా చేపట్టకపోవడం, మురుగు నీరు రోడ్లపైనే నిలవడంతో దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయని ప్రజలు వాపోతున్నారు.
పట్టింపు కరువు..
జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నా వైద్యారోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామాల్లో, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. పీహెచ్‌సీల్లో సరిపడా మందులు, రక్త పరీక్షల కిట్లు అందుబాటులో లేకపోవడంతో పేద రోగులు ప్రయివేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది.
ఏడాది కేసులు
2024 180
2025 111
2026 15
జిల్లా వ్యాప్తంగా డెంగీ నివారణకు చర్యలు చేపడుతున్నాం. డెంగీ కేసులు నమోదవుతున్న ఏరియాల్లో సర్వేలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్నాం. కావాల్సిన మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి.
– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్‌వో, కామారెడ్డి
● 15 రోజుల క్రితం బీబీపేటకు చెందిన యువకుడు నరేశ్‌కు ప్లేట్‌లెట్స్ పడిపోవడంతో ఓ ప్రయివేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. వైద్యులు డెంగీగా నిర్ధారణ చేసి ప్లేట్‌లెట్స్ ఎక్కించారు. వారంపాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు.
జ్వరాలతో మంచం పడుతున్న ప్రజలు
నెల రోజుల్లో అధికారికంగా
15 డెంగీ కేసులు
అనధికారికంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో వందల్లో బాధితులు
పల్లెలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై
కొరవడిన పర్యవేక్షణ
పట్టించుకోని వైద్య ఆరోగ్యశాఖ
మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండా చౌరస్తాకు చెందిన అద్వైత, సాయివైష్ణవి, మనులకు రెండు రోజుల క్రితం డెంగీ పాజిటివ్ వచ్చింది. స్థానిక పీహెచ్‌సీలో వైద్యం పొందుతున్నారు.
నెల రోజుల క్రితం జిల్లా కేంద్రానికి చెందిన నాలుగేళ్ల దివ్యాంశ్‌కు డెంగీ సోకింది. ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు.


