రాజీయే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీయే రాజమార్గం

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

జాతీయ లోక్‌ అదాలత్‌లో

3,173 కేసుల పరిష్కారం

రోడ్డు ప్రమాద బాధితులకు

రూ.1.17 కోట్ల పరిహారం

కామారెడ్డి టౌన్‌: పరస్పర సఖ్యత, రాజీమార్గమే వివాద పరిష్కారానికి రాజమార్గమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్‌పర్సన్‌ పి.ముక్తిద అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్‌ అదాలత్‌లో ఆమె మాట్లాడారు. లోక్‌ అదాలత్‌ సమర్థవంతమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార వేదిక ని తెలిపారు. ఇందులో వెలువడే అవార్డు తుది తీర్పుగా పరిగణించబడుతుందని, దీనిపై ఎలాంటి అప్పీల్‌కు అవకాశం ఉండదని స్పష్టంచేశారు. రాజీమార్గంతో సమాజంలో శాంతి, సామరస్యం నెల కొనడంతోపాటు ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయన్నారు. కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి టి. నాగరాణి, సీనియర్‌ సివిల్‌ జడ్జి డాక్టర్‌ సూర సుమలత, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి బి. దీక్ష, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు నారాయణ, కోర్టు సూపరింటెండెంట్లు వెంకట్‌రెడ్డి, చంద్రసేన్‌రెడ్డి, ఖాన్‌, బ్యాంకర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

నాలుగు కోర్టుల్లో నిర్వహణ

జిల్లాలోని కామారెడ్డి కోర్టులో 1,676, బాన్సువాడ 635, ఎల్లారెడ్డి 385, బిచ్కుందలో 477 కేసులు, మొత్తం 3,173 కేసులు రాజీమార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో 21 సివిల్‌, 3,085 క్రిమినల్‌, 67 ప్రీలిటిగేషన్‌ కేసులు ఉన్నాయి. 11 మోటార్‌ వాహన ప్రమాద కేసులను పరిష్కరించి, బాధితు లకు మొత్తం రూ.1,17,66,000 పరిహారంగా మంజూరు చేశారు. నిజాంసాగర్‌, మాచారెడ్డి పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ఇద్దరు పోక్సో బాధితులకు రూ.2 లక్షలు, రూ.3 లక్షల చొప్పున జిల్లా జడ్జి పరిహార చెక్కులను అందజేశారు. లోక్‌ అదాలత్‌కు హాజరైన సుమారు 300 మంది కక్షిదారులకు డీఎల్‌ఎస్‌ఏ ఆఫీస్‌ అసిస్టెంట్‌ జె. సాయి ప్రణీత్‌ పులిహోర పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement