వర్ని : రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని, నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగు నీరందించడమే తన లక్ష్యమని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నిజాంసాగర్ ప్రధాన కాలువపై చందూర్ శివారులో నిర్మించిన లిఫ్ట్‌ను జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్‌తో కలిసి పోచారం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 1.45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు. నిజాంసాగర్ కాలువల ద్వారా అందించే సాగునీటితోపాటు నిజాంసాగర్ కాలువ ఎగువన ఉన్న నాన్ కమాండ్ ఏరియా పంట పొలాలకు సాగునీరందించేందుకు రూ.106 కోట్లతో చందూర్, జాకోరా, చింతకుంట లిఫ్ట్ ఇరిగేషన్‌ల నిర్మాణం చేపట్టినట్లు వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో వ్యక్తిగత స్వార్థం కోసం ఏనాడూ పనిచేయలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సాగునీటి రంగానికి అధిక నిధులు మంజూరు చేయించానని, ఇళ్లు లేని పేదల కోసం వేలాది ఇళ్లు మంజూరు చేయించి నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
అభివృద్ధి పనులు ప్రారంభం
చందూర్ నుంచి లక్ష్మాపూర్ వరకు చేపట్టనున్న బీటీ రోడ్డు పనులను పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రారంభించారు. చందూర్ బస్టాండ్ వద్ద శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించడంతోపాటు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఆగ్రో ఇండస్ట్రీస్ మాజీ చైర్మన్ కాసుల బాలరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్‌బాబా, చందూర్ సర్పంచ్ మాధవరెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు ప్యారం అశోక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్, మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రతి గుంటకూ నీరందించడమే లక్ష్యం
ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ఎంపీ షెట్కార్‌తో కలిసి
చందూర్ లిఫ్ట్ ప్రారంభం


