‘విధి నిర్వహణలో సంయమనం పాటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘విధి నిర్వహణలో సంయమనం పాటించాలి’

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

కామారెడ్డి టౌన్‌ : నిరసనలు, ఆందోళనల సమయంలో పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను కాపాడాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో హోంగార్డు స్థాయి నుంచి అధికారుల వరకు బందోబస్తు నిర్వహణ, విధులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రత్యేక అవగాహన కల్పించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును గౌరవిస్తూనే, చట్టవ్యతిరేక చర్యలకు తావులేకుండా సమర్థవంతంగా శాంతిభద్రతలను పరిరక్షించాలన్నారు. పోలీసు సిబ్బంది వ్యక్తిగత జీవితంలోనూ క్రమశిక్షణ పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు, గేమ్స్‌ జోలికి వెళ్లొద్దని హెచ్చరించారు. ఎవరైనా సహచర సిబ్బంది వీటికి అలవాటు పడితే నాకెందుకులే అని ఉపేక్షించకుండా, వారిని ఆ ఊబి నుంచి బయటకు తెచ్చే బాధ్యత స్నేహితులుగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుసూదన్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్లు సంతోష్‌కుమార్‌, నవీన్‌, ఆర్‌ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో

32 మందికి జైలు

కామారెడ్డి టౌన్‌ : మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 32 మందికి న్యాయస్థానాలు శిక్షలు విధించాయని ఎస్పీ రాజేశ్‌ చంద్ర తెలిపారు. జిల్లావ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 367 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. పట్టుబడిన వాహనదారులను శనివారం జిల్లాలోని వివిధ కోర్టులలో హాజరుపరచగా న్యాయమూర్తులు వారికి మొత్తం రూ.5,17,750 జరిమానా విధించారన్నారు. వీరిలో మద్యం తీవ్రత ఎక్కువగా ఉన్న 32 మందికి జైలు శిక్షలు ఖరారయ్యాయన్నారు. ఏడుగురికి ఒక్క రోజు, 13 మందికి రెండు రోజులు, ఆరుగురికి మూడు రోజులు, ముగ్గురికి నాలుగు రోజులు, మరో ముగ్గురికి ఐదు రోజుల చొప్పున జైలు శిక్ష పడిందని తెలిపారు.

పారా కిక్‌బాక్సింగ్‌లో స్వర్ణ పతకం

కామారెడ్డి రూరల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈనెల 11న నిర్వహించిన జాతీయ స్థాయి వాకో పారా కిక్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో గూడెం గ్రామానికి చెందిన అరవింద్‌ కుమార్‌ సత్తా చాటారు. పీ1 కేటగిరీలో అరవింద్‌కుమార్‌ స్వర్ణ పతకం సాధించారని కోచ్‌ సూర్యప్రసాద్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement