27న సమైక్యతా సదస్సు
బాన్సువాడ రూరల్: మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో ఈనెల 16న నిర్వహించ తలపెట్టిన జాతీయ సమైక్యతా సదస్సును వినాయక చవితి నేపథ్యంలో ఈనెల 27కు వాయిదా వేసుకున్నట్లు నిర్వాహకుడు ముఫ్తీ ఉమర్ బిన్ ఈసా శనివారం తెలిపారు. శాంతిభద్రతల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్రను కలిసి అనుమతి తీసుకోవడం జరిగిందన్నారు. 27న సాయంత్రం మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈకార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక బాద్యత కలిగిన ప్రముఖులు, హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ మతాల ప్రముఖులు హాజరు అవుతారని పేర్కొన్నారు.
ఉపాధ్యాయ దంపతులకు పురస్కారాలు
కామారెడ్డి అర్బన్: వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మానంలో కామారెడ్డికి చెందిన డాక్టర్ నీల బాలు, ఉపాధ్యాయురాలు రజనీ దంపతులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందజేసి ఘనంగా సన్మానించారు. వైశ్య వికాస వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కాచం సత్యనారాయణ, యాదగిరి గుట్ట ట్రస్ట్‌బోర్డు సభ్యుడు గుండా మల్లయ్య గుప్తా, పవన చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రవి గుప్తాలు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులకు సన్మానం
కామారెడ్డి అర్బన్: ఆర్యక్షత్రీయ సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ ఉపాధ్యాయులను ఛత్రపతి సొసైటీ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి శ్రీకృష్ణ ధ్యానమందిరంలో ఘనంగా సన్మానించారు. ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన రామారెడ్డి ఎంఈవో ఆనందరావుతో పాటు ఉపాధ్యాయులు బాల్‌కిషన్, అశోక్‌రావు, బల్వంత్‌రావు, కరుణ, కీర్తిమాలిని, ప్రణీతలను సన్మానించారు. ఛత్రపతి సొసైటీ అధ్యక్షుడు ఎల్.కృష్ణారావు, జనార్దన్ తదితరులున్నారు.
మంత్రి సీతక్కకు సర్పంచ్‌ల వినతి
దోమకొండ: గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేసినట్లు సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర కార్యదర్శి, సంఘమేశ్వర్ సర్పంచ్ లోయపల్లి శ్రీనివాస్‌రావ్ తెలిపారు. ఉపసర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేయాలని, సర్పంచ్‌ల గౌరవ వేతనం రూ.25 వేలకు పెంచాలని కోరామన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వం నేరుగా చెల్లించాలని, పంచాయతీ పరిధిలో అనుమతులు సర్పంచ్‌ల పరిధిలో ఉండాలన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులపై పల్లె ప్రగతి పనులపై పూర్తి అధికారం సర్పంచ్‌లకు ఉండాలన్నారు. సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారని వివరించారు.
గిరిజన మహాసభలను విజయవంతం చేయాలి
రామారెడ్డి : ఈ నెల 27, 28 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే గిరిజన సంఘం రాష్ట్ర 4వ మహా సభను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మోతిరామ్ నాయక్ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని జగదాంబ తండాలో మహాసభ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈసందర్భంగా మోతిరామ్‌నాయక్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల హక్కులను కాలరాస్తున్నాయని ఆరోపించారు.ఈసభలో సమస్యల మీద పోరాటాల రూపకల్పన జరుగుతుందని పేర్కొన్నారు. నారాయణ నాయక్ దేవి సింగ్ నాయక్, గోపాల్ నంద, మోహన్, గిరిజన రైతులు పాల్గొన్నారు.
వేంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు
తాడ్వాయి : మండల కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామి వారిని పల్లకీలో ఊరేగించారు. నందు, సదాశివుడు, సిద్దిరాంరెడ్డి, రవికుమార్, పాల్గొన్నారు.
సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయంలో..
మద్నూర్: మండలంలోని సలాబత్‌పూర్ వద్ద జాతీయ రహదారిపై గల హనుమాన్, శివాలయాల్లో శనివారం తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక మూడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు, మహిళలు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సలాబత్‌పూర్ హనుమాన్ ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందించారు.
ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో హోమం
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డిలో శనివారం ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. పట్టణంలోని బాలాగౌడ్ ఫంక్షన్‌హాల్‌లో ఆర్యసమాజ్ ఆధ్వర్యంలో హోమం చేశారు. శ్రావణమాసం ముగింపులో భాగంగా హోమం నిర్వహించారు. నిర్వాహకులు నాగరాజుగౌడ్, శ్రీకాంత్, ప్రకాష్, రవి తదితరులు పాల్గొన్నారు.
ప్రజా ఉద్యమాల ధ్రువతార సీతారాం ఏచూరి
కామారెడ్డి టౌన్ : ప్రజా ఉద్యమాల ధ్రువతార సీతారం ఏచూరి అని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. సీపీఎం పూర్వ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో శనివారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమం నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఏచూరి, వామపక్ష ఉద్యమ బలోపేతానికి విశేష సేవలందించారని కొనియాడారు. ఏచూరి పోరాట స్ఫూర్తి, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకులు కొత్త నర్సింలు, నారాయణ, ప్రవీణ్, మాసయ్య, రవి, ఎల్లవ్వ, శ్యామల, రమణ, సిద్ధవ్వ తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో మట్టిగణపతుల తయారీ
సదాశివనగర్ : మండల కేంద్రంలో మోడల్ స్కూల్‌తో పాటు ఆయా గ్రామాల్లో పాఠశాలల్లో విద్యార్థులు మట్టి గణపతులను తయారు చేశారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజిరెడ్డి మట్టి గణపతులను పూజించాలని సూచించారు. అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.
పిట్లంలో..
పిట్లం: స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కుమ్మరి శేఖర్ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఇన్‌చార్జి ఎంపీడీవో మాణికారావు, సిబ్బంది, నాయకులు మోహన్‌రెడ్డి, నవీన్, తదితరులు పాల్గొన్నారు.
గాంధారిలో..
గాంధారి: స్థానిక అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఎఫ్‌ఆర్వో రమేశ్ మట్టి గణపతి విగ్రహాలతో పాటు మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. సింగిల్ విండో చైర్మన్ సాయికుమార్, మాజీ సర్పంచ్ సంజీవు, వీడీసీ చైర్మన్ రామస్వామి, నేరేళ్ల సంతోష్, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కామారెడ్డి టౌన్ : జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఇలియాస్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 5, 29, 30 వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీల ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఐరెని సందీప్, మండల అధ్యక్షుడు
భక్తిభావాన్ని పెంపొందించుకోవాలి
భిక్కనూరు: ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మహ్మద్ ఇలియాస్ అన్నారు. భిక్కనూరులో భారతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహల పంపిణీకి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.పీసీసీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, సర్పంచ్ బల్యల రేఖ, భారతి ఫౌండేషన్ చైర్మన్ లింగా రాజబాబుగౌడ్, నేతలు పాల్గొన్నారు.
మాతా శిశు సంరక్షణపై అవగాహన
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కాకతీయ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో మాతా శిశు సంరక్షణ, పోషకాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. రోటరీ అధ్యక్షుడు సబ్బని కృష్ణహరి, కార్యదర్శి ఎస్.సంతోష్‌కుమార్, డాక్టర్ ప్రియాంక, మానస తల్లులు, చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారం, ప రిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.
క్రీడాకారుడికి సన్మానం
దోమకొండ: ఆర్చరీలో స్వర్ణ పతకం సాధించిన మండల కేంద్రానికి చెందిన అనుదీప్‌ను శనివారం గడికోటలో అర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తీగల తిర్మల్‌గౌడ్, సర్పంచ్ ఐరేని నర్సయ్యలు సన్మానించారు. జాతీయస్థాయి అర్చరీ పోటీ ల్లో అక్టోబర్ 21 నుంచి 23 వరకు పాల్గొంటారని తిర్మల్‌గౌడ్ పేర్కొన్నారు. వివరించారు. కార్యక్రమంలోఅర్చరీ సంఘం జిల్లా కార్యదర్శి మోహన్ రెడ్డి, అర్చరీ కోచ్ ప్రతాప్ దాస్, సింగిల్‌విండో డైరెక్టర్లు పాల్గొన్నారు.
విద్యుత్ లైన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన
బాన్సువాడ రూరల్: మండలంలోని సంగోజీపేట్ గ్రామానికి 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం ఆశాఖ అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు సర్పంచ్ మంద సంగమేశ్వర్ తెలిపారు. శనివారం ట్రాన్స్‌కో బాన్సువాడ రూరల్ ఏఈ అనిల్‌కుమార్‌తో కలిసి విద్యుత్ లైన్ ఏర్పాటకు క్షేత్రసందర్శన చేసి వ్యయం అంచనా వేశారు. హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ నుంచి గ్రామం వరకు 8 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు.
లింగంపేట ఎమ్మార్పీఎస్ కార్యవర్గం ఎన్నిక
లింగంపేట: మండల ఎమ్మార్పీఎస్ నూతన కార్యవర్గాన్ని శనివారం ఎన్నుకున్నారు. మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధ్యక్షుడిగా గన్నారం అల్లూరి, ఉపాధ్యాక్షుడు సాయిలు, ప్రధాన కార్యదర్శి బైండ్ల తిరుపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు, కోశాధికారి డప్పు సాయిలు, సోషల్ మీడియా కన్వీనర్ అనిల్, సలహాదారులు లక్ష్మినారాయణ, పెంటయ్య, సంజీవులు, భూమయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ట్రాక్టర్‌ను ఢీకొన్న బైక్.. ఒకరికి గాయాలు
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): బంజారాతండా వద్ద ట్రాక్టర్‌ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న గోపాల్‌పేటకు చెందిన కమ్మరి రవి తీవ్రంగా గాయపడ్డాడు. రవిని స్థానికులు చికిత్స నిమిత్తం మెదక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
వివాహిత అదృశ్యం
భిక్కనూరు: మండల కేంద్రంలో వివాహిత ఒకరు అదృశ్యమైనట్లు భిక్కనూరు ఎస్సై అనిల్ శనివారం తెలిపారు. మండల కేంద్రానికి చెందిన యువతి వివాహం నిజమాబాద్‌కు చెందిన యువకుడితో ఎనిమిదేళ్ల క్రితం జరిగింది. కొన్ని రోజులుగా అత్తగారితో విభేదాలు రావడంతో తల్లిగారింట్లో ఉంటుంది. వారం రోజుల క్రితం కూడా అత్తగారింటికి వెళ్లిన ఆమె మళ్లీ గొడవ పడి భిక్కనూరుకు ఒక్కరోజులోనే వచ్చింది. శుక్రవారం రాత్రి తన కుమారుడు, కుమార్తెలను తన తండ్రి దుకాణానికి పంపించి ఇంటి నుంచి బయటకు ఎవ్వరికి చెప్పకుండా వెళ్లిపోయింది. వివాహిత తండ్రి పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు.
తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన
నాగిరెడ్డిపేట : తమ గ్రామంలో సర్పంచ్‌గా తనను గౌరవించడంలేదని పేర్కొంటూ నాగిరెడ్డిపేట మండలంలోని ధర్మారెడ్డి గ్రామసర్పంచ్ గూలపల్లి లక్ష్మీ శనివారం తహసీల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో స్మార్ట్‌రేషన్‌కార్డుల పంపిణీకి స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు. ఉపసర్పంచ్ బిక్షపతి, వార్డుసభ్యులు సిద్ధవ్వ, సాయిబాబ, నాయకులు నారాయణ, రఘు, రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


