● మూడేళ్లుగా కొట్టుకుపోతున్న
కాసుల కత్త వంతెన
● వర్షాలు పడితే రాకపోకలు బంద్
● సమస్య పరిష్కరించాలని ప్రజల వినతి
లింగంపేట : మూడేళ్లుగా భారీ వర్షాలకు కాసులకత్త వంతెనకు ఇరువైపులా రోడ్డు కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వంతెనకు శాశ్వత మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రతి ఏటా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోతున్నాయని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెనకు ఇరువైపులా రోడ్డు వేసి సపోర్టుగా ప్రహరీ కట్టించాలని కోరుతున్నారు. మూడేళ్లుగా అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారే తప్ప నిధులు మంజూరు కావడం లేదు. వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోతే నాగారం, బాయంపల్లి, కొర్పోల్, బాణాపూర్, కిషన్‌నాయక్‌తండా, లక్ష్మన్‌నాయక్‌తండా, లింగంపల్లి, లింగంపేట, నల్లమడుగు, ముస్తాపూర్, తదితర గ్రామాలు, తండాలతో పాటు గాంధారి, లింగంపేట మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పంటలు నీట మునుగుతున్నాయి. మూడేళ్లుగా తాత్కాలికంగా మొరం వేసి రాకపోకలు పునరుద్ధరిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
లింగంపేట మండలం నాగారం కాసుల కత్త వంతెన మరమ్మతుల కోసం హ్యామ్‌లో రూ. కోటి వరకు ప్రతిపాదనలు పంపాం. వంతెనకు ఇరువైపులా శాశ్వత పరిష్కారం కోసం వింగ్ వాల్స్ నాలుగు, కింది భాగం నుంచి సీసీతో పాటు 50 మీటర్లు సీసీ రోడ్డు వేయడానికి అంచనా వేసి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాము.
– సందీప్, పీఆర్ ఏఈ


