బిచ్కుంద/బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే అరుణతార డిమాండ్ చేశారు. శనివారం బిచ్కుందలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిజాంపాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17కు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తుందన్నారు. నాయకులు మల్లికార్జున్, శివాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే బాన్సువాడ బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జి యెండల లక్ష్మీనారాయణ మాట్లాడారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలన్నారు. 2001 అక్టోబర్ 7న గుజరాత్ సీఎంగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కేంద్ర కమిటీ పిలుపు మేరకు ’సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ’ఆశీర్వాద దీపం’ పేరుతో అన్ని మండల కేంద్రాల్లో 8 రకాల కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శంకర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొనాల గంగారెడ్డి, నాయకులు దొరబాబు, చందూరి హన్మండ్లు, రాంగోపాల్ రెడ్డి, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


