అఽభ్యంతరాలతో.. ప్రారంభం కాని పనులు | - | Sakshi
Sakshi News home page

అఽభ్యంతరాలతో.. ప్రారంభం కాని పనులు

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

స్థలం ఎంపికలో ఆలస్యం

దోమకొండ: స్థానిక సీహెచ్‌సీని 30 నుంచి 50 పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేస్తూ గతేడాది ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీజీఎంఐడీసీ) ఇందు కోసం రూ.22 కోట్లతో ప్రతిపాదనలు చేసింది. ఆస్పత్రి భవన నిర్మాణం కోసం అప్పటి పంచాయతీ పాలకవర్గం ముత్యంపేట రోడ్డులోని దేవునికుంటలో సర్వే నంబర్‌ 1796,1797లో 4 ఎకరాల స్థలాన్ని కేటాయించిన తీర్మానం కాపీని అందజేసింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఈ స్థలంలో భవన నిర్మాణానికి అధికారులు ముందుకు వచ్చారు.

నిధులు ఖర్చు ఇలా..

సివిల్‌ వర్క్‌, ఆస్పత్రి భవనం, మార్చురీ గది నిర్మాణం కోసం రూ.11.22 కోట్లు, కాంపౌండ్‌ వాల్‌ కోసం రూ.10 లక్షలు, సీసీ రోడ్డు కోసం రూ.7లక్షలు, మెడికల్‌ గ్యాస్‌ పైపులైన్‌ కోసం రూ.25 లక్షలు. అదేవిధంగా ఫైర్‌ ఫిట్టింగ్‌ సిస్టం కోసం రూ.20 లక్షలు, నీటి సరఫరా, సానిటేషన్‌ ఏర్పాట్లకు రూ.1.14 కోట్లు, విద్యుత్‌ సరఫరా, ఇతర ఏర్పాట్లకు 1.71 కోట్లు, మెడికల్‌ పరికరాలకు రూ.1.25 కోట్లు, ఇంజినీరింగ్‌, ఇతర అభివృద్ధి పనులకు రూ.6 కోట్లు ఖర్చు చేస్తారు.

సరిపడా స్థలం లేక..

స్థానిక దేవునికుంటలో సర్వే నంబర్‌ 1796,1797లో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి అభ్యంతరాలు వచ్చాయి. 4 ఎకరాల స్థలం ఉందని పంచాయతీ పాలకవర్గం గతంలో తీర్మానం ఇవ్వగా, అంత స్థలం లేదని రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 2 ఎకరాల స్థలం ఉందని, దాంట్లో కొంత పట్టాభూమిగా ఉందని తేల్చారు. ఇంత తక్కువ స్థలంలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయలేమని ఇంజినీరింగ్‌ అధికారులు పనులు ప్రారంభించలేదు. దీంతో ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రి భవనం పక్కన వృథాగా ఉన్న పాత హెల్త్‌సబ్‌సెంటర్‌ భవనం శిధిలావస్థకు చేరింది. దీన్ని తొలగించాలని, అదేవిధంగా ఆస్పత్రి వెనక స్థలం ఉందని ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం అధికారులకు సూచించింది. దీంతో డీసీహెచ్‌ఎస్‌తో పాటు టెక్నికల్‌ అధికారులు ఇప్పుడున్న 30 పడకల ఆస్పత్రి వద్దనే 50 పడకల ఆస్పత్రి నిర్మాణం చేయడానికి సానుకూలంగా స్పందించారు. పనులు త్వరగా ప్రారంభించాని స్థానికులు కోరుతున్నారు.

దోమకొండలో 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఎంపికలో ఆలస్యంతో పనులు ప్రారంభం కాలేదు. గతంలో ఇచ్చిన స్థలంలో నిర్మాణానికి అభ్యంతరాలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 30 పడకల ఆస్పత్రి వద్దనే 50 పడకల ఆస్పత్రి నిర్మాణానికి స్థల పరిశీలన చేశాం. టెక్నికల్‌ ఇంజినీరింగ్‌ అధికారుల నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తాం.

–శ్రీనివాస్‌, డీసీహెచ్‌ఎస్‌, కామారెడ్డి

దోమకొండ సీహెచ్‌సీని 50 పడకలకు అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉత్తర్వులు

భవన నిర్మాణానికి స్థలం

ఇచ్చిన పంచాయతీ పాలకవర్గం

గతేడాది రూ.22 కోట్ల

నిధులు మంజూరు

పనులు త్వరగా ప్రారంభించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement