● నేడు తెయూ పాలకమండలి సమావేశం
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పాలక మండలి సమావేశం సెక్రటేరియట్(హైదరాబాద్)లోని ఉన్నత విద్యాశాఖ కార్యాలయంలో సోమ వారం జరగనుంది. వీసీ టీ యాదగిరిరావు అధ్యక్షతన నిర్వహించే ఉన్నతస్థాయి భేటీకి ఈసీ ఎక్స్‌అఫీషియో సభ్యులైన రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కళాశాల విద్యాకమిషనర్ దేవసేనతోపాటు వర్సిటీ రిజిస్ట్రార్, నూతన ఈసీ సభ్యులు హాజరుకానున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వర్సిటీ నూతన పాలక మండలిని నియమించిన తర్వాత జరుగుతున్న మొదటి కీలక సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
పదోన్నతులే..
గత రెండేళ్లుగా పాలకమండలి పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో క్యాంపస్‌లో పలు అభివృద్ధి పనులు, బడ్జెట్ ఆమోదం, కీలకమైన నిర్ణయాలు వంటివి నిలిచిపోయాయి. పాలనాపరమైన స్తబ్దత వీడేలా, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేలా నేటి భేటీలో స్పష్టమైన, కీలక నిర్ణయాలు తీసుకుంటారని వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు భావిస్తున్నారు.
2014 (2012–13) అద్యాపకుల పదోన్నతుల అంశమే ప్రధాన ఎజెండాగా ఈసీ సమావేశంలో చర్చించనున్నారు. తాము 13 ఏళ్ల నుంచి పదోన్నతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కనీసం షరతులతో కూడిన కండిషనల్ పదోన్నతులైనా కల్పించాలని అధ్యాపకులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే వీరి నియామకాలపై ఇటీవల చోటు చేసుకున్న ఘటనలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది.
అలాగే నూతనంగా మంజూరైన ఇంజినీరింగ్ కళాశాలలో అధ్యాపకుల కొరత, బోధనేతర సిబ్బంది నియామకాలపై చర్చించనున్నారు. 2024–25, 2025–26 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం, మహిళా హాస్టల్స్, బాయ్స్ హాస్టల్ నూతన భవన నిర్మాణాల పనుల పురోగతిపై చర్చ, అనుబంధ కళాశాలల అనుబంధ గుర్తింపు, పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.
చీఫ్ సెక్రెటరీకి ఫిర్యాదు..
పాలక మండలికి వినతి
తెలంగాణ యూనివర్సిటీలో 2014లో నియా మకమైన అధ్యాపకులకు పదోన్నతులు కల్పించవద్దంటూ 2012 నియామక ప్రక్రియ బాధితుడు ఆంగోత్ వెంకట్‌నాయక్ చీఫ్ సెక్రెటరీ సంజయ్ జాజుకు ఫిర్యాదు చేశారు. గతేడాది నియామకాలను రద్దు చేస్తూ ఇచ్చిన హై కోర్టు తీర్పుపై పాలకమండలిలో చర్చించకుండా ఏకపక్షంగా హై కోర్టులో అప్పీలుకు వెళ్లి, డివిజన్ బెంచ్‌లో కేసు పెండింగ్‌లో ఉండగా పదోన్న తులు కల్పించే ప్రయత్నంపై ఆయన ఫిర్యాదు చేశారు. అలాగే తెయూ పాలకమండలి సభ్యులను వ్యక్తిగతంగా కలిసి పదోన్నతుల అంశం తీర్మానాన్ని ఆమోదించవద్దని కోరినట్లు సమాచారం.


