30 పడకలు.. ముగ్గురే వైద్యులు! | - | Sakshi
Sakshi News home page

30 పడకలు.. ముగ్గురే వైద్యులు!

Aug 13 2026 1:21 AM | Updated on Aug 13 2026 1:21 AM

30 పడకలు.. ముగ్గురే వైద్యులు!

పిట్లం: మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రి భవనం అందుబాటులోకి వచ్చినా.. అందుకు అనుగుణంగా వైద్య సిబ్బందిని నియమించకపోవడంతో వైద్య సేవలు ఆశించిన స్థాయిలో అందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో మొత్తం ఆరుగురు వైద్యులు అవసరం ఉండగా ప్రస్తుతం ముగ్గురే విధులు నిర్వహిస్తున్నారు. అందులో ఒకరు ఇన్‌చార్జి, మరొకరు రెగ్యులర్‌, ఇంకొకరు కాంట్రాక్ట్‌ పద్ధతిన విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు నర్సింగ్‌, ఇతర సహాయక సిబ్బంది కొరత కూడా రోగులకు ఇబ్బందిగా మారుతోంది.

వైద్యుల కోసం ఎదురుచూపులు

పిట్లంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి మండలం నుంచే కాకుండా సంగారెడ్డి జిల్లా తడ్కల్‌, కంగ్టి మండలాల నుంచి కూడా రోగులు వైద్యం కోసం ప్రతి రోజు సుమారు 250 మంది వస్తుంటారు. వైద్యుల సంఖ్య తక్కువగా ఉండటంతో కొన్ని సమయాల్లో వైద్య సేవలు ఆలస్యమవుతున్నాయని రోగులు వాపోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతాల్లోని ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

సిబ్బంది లేక..

ఆస్పత్రికి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించినా అవసరమైన స్థాయిలో వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఎక్స్‌రే మిషన్‌ ఉన్నా దానికి సంబంధించిన టెక్నీషియన్‌ లేరు. దంత వైద్యులు లేరు. ఫార్మసిస్ట్‌ బిచ్కుంద నుంచి డిప్యుటేషన్‌పై వారానికి రెండు రోజులు మాత్రమే పిట్లం ఆస్పత్రికి వస్తుంటారు. స్టాఫ్‌నర్స్‌లు 14 మంది ఉండగా వారిలో ముగ్గురిని బాన్సువాడ ఆస్పత్రికి డిప్యుటేషన్‌పై పంపించారు. ప్రస్తుతం 11 మంది మాత్రమే ఉన్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్‌ డిప్యుటేషన్‌పై ఎల్లారెడ్డి నుంచి వస్తుంటారు. గైనకాలజిస్ట్‌ను డిప్యుటేషన్‌పై బాన్సువాడకు వేయగా ఆమె మూడు రోజులు పిట్లంలో, మరో మూడు రోజులు బాన్సువాడలో విధులు నిర్వహిస్తున్నారు. శస్త్ర చికిత్స అవసరం ఉన్న వారికి బాన్సువాడ, కామారెడ్డి, నిజామాబాద్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. రాత్రి సమయాల్లో అత్యవసర వైద్యానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అదే విధంగా వర్షం పడినప్పుడు ఆస్పత్రికి వెళ్లే రోడ్డు చిత్తడిగా మారుతోంది. పాదచారులు, వృద్ధులు నడవలేని స్థితిలో రోడ్డు ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని, అలాగే రోడ్డు సమస్యను పరిష్కరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

వైద్యులు, సిబ్బంది కొరతతో

రోగులకు ఇబ్బందులు

పిట్లం నూతన ఆస్పత్రిలో

పూర్తిస్థాయి వైద్య సేవలకు ఆటంకం

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని

ప్రజల డిమాండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement