కామారెడ్డి రూరల్: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ శివారులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బురదలోకి కూరుకుపోయింది. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పాత బస్టాండ్ నుంచి శనివారం ఉదయం బయలుదేరిన ఆర్టీసీ బస్సు రెడ్డిపేటకు వెళ్తోంది. ఈ క్రమంలో బస్సుకు ఎదురుగా వాహనాలు రావడంతో అడ్లూర్ గ్రామ సమీపంలో డ్రైవర్ బస్సును రోడ్డు నుంచి కిందికి దించాడు. ఈ క్రమంలో భారీ వర్షంతో రహదారి పక్కన ఉన్న రోడ్డు బురదగా మారి అందులో కూరుకుపోయింది. ఆగిపోయిన బస్సును డ్రైవర్ వేగం పెంచడంతో బస్సు మొరాయించి సైడ్‌కు ఒరిగిపోయి ప్రమాదకరంగా మారింది. బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. డ్రైవర్ బస్సును పక్కకు నిలిపి ప్రయాణికులను కిందికి దించాడు. విషయం తెలిసిన స్థానికులు, పోలీసులు, ఆర్టీసీ అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.


