● శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం
● త్వరలో కౌలాస్ గేట్లు ఎత్తే అవకాశం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): పోచారం ప్రాజెక్టుకు శనివారం వరద తాకిడి మళ్లీ పెరిగింది. ఎగువ ప్రాంతంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ప్రాజెక్టులోకి వరద పోటెత్తింది. శుక్రవారం రాత్రి ప్రాజెక్టులోకి సుమారు 1500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా శనివారం ఉదయం నాటికి 5,983 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువలోకి 50 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, ప్రాజెక్ట్ అలుగు పైనుంచి పొంగిపొర్లుతూ 5,933 క్యూసెక్కుల నీరు అవుట్ ఫ్లోగా వెళుతోందని ఇరిగేషన్ ఏఈ అక్షయ్ కుమార్ తెలిపారు
నిండిన కౌలాస్..
నిజాంసాగర్(జుక్కల్): జుక్కల్ మండలంలోని కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలతోపాటు సంగారెడ్డి జిల్లాలోని కంగ్టి మండల పరిధిలో కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి కౌలాస్ ప్రాజెక్టులోకి 765 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు 1.237 టీఎంసీలకు గాను ప్రస్తుతం 457.20 మీటర్లు 1.049 టీఎంసీలకు చేరింది. జూలై 29 నుంచి కౌలాస్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో ప్రారంభం కాగా, 11 రోజుల్లో జలాశయంలోకి 0.610 టీఎంసీల నీరు చేరింది. కౌలాస్ ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో లోతట్టు ప్రాంత ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని పేర్కొన్నారు.
‘సాగర్’లోకి 9,283 క్యూసెక్కులు..
ఉమ్మడి జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శనివారం సాయంత్రం 9,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోపాటు పోచారం ప్రాజెక్టు ద్వారా 4,800 క్యూసెక్కులు, ఘనపురం ఆనకట్ట ద్వారా 1,500 క్యూసెక్కుల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగుల (17.8 టీఎంసీలు)కు గాను ప్రస్తుతం 1399.88 అడుగుల (11.182 టీఎంసీల) నీరుంది.


