వీధి కుక్కల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు
బాన్సువాడ : వీధి కుక్కల బెదడ నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆగ్రో చైర్మన్ కాసుల బాల్‌రాజ్ అన్నారు. శనివారం మున్సిపల్‌పరిధిలో వీధి కుక్కలను పట్టించి ఇతర ప్రాంతాలకు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల బాన్సువాడలో చిన్నారులు, మహిళలపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందేన్నారు. ప్రజల భద్రత దృష్టిలో ఉంచుకుని, వర్షాకాలంలో కుక్కలు దాడులు చేసే అవకాశం ఉన్నందున ప్రత్యేక బృందాల సహాయంతో పట్టణంలో పలు ప్రాంతాల్లో సంచరిస్తున్న వీధి కుక్కలను తరలించినట్లు పేర్కొన్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ నాయకులు గోపాల్‌రెడ్డి, నార్ల రవీందర్, గౌస్ తదితరులు ఉన్నారు.
పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ శనివారం రెయిన్ కోట్స్ పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయ న మాట్లాడారు. పారిశుద్ధ్య కార్మికులు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో ము న్సిపల్ కమిషనర్ జగ్జీవన్, కౌన్సిలర్లు గఫార్, దశరథం, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్‌గౌడ్, కోఆప్షన్ సభ్యులు పప్పు వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్, రాములు తదితరులున్నారు.
పోటీతత్వంతో యువత ముందుకు వెళ్లాలి
నిజాంసాగర్(జుక్కల్): మహమ్మద్ నగర్ మండలం దూప్‌సింగ్‌తండా గ్రామ పంచాయతీ పరిధిలో ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులను సర్పంచ్ శ్రీనివాస్ శనివారం గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. యువత పోటీతత్వంతో మరిన్ని కొలువులు సాధించి తండాకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సర్పంచ్ కోరారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్ బలరాం, పంచాయతీ కార్యదర్శి చరణ్‌కుమార్ యువకులు ఉన్నారు.
సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): సనాతన ధర్మాన్ని కాపాడడానికి భగవాన్ నామస్మరణ ఒక్కటే మార్గమని శ్రీరామదండు నిర్వాహకులు బ్రహ్మచారి అన్నారు. శనివారం మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన శ్రీరామదండు సంస్థ ఆధ్వర్యంలో 108 సార్లు హనుమాన్ చాలీసాను 108 రకాలుగా వివిధ సంగీత వాయిద్యాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన చుక్కయ్యగారి నరసింహరెడ్డి ఆధ్వర్యంలో ఈకార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
ట్రాన్స్‌కో ఏఈకి సన్మానం
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): నాగిరెడ్డిపేట ట్రానన్స్‌కో సబ్ ఇంజినీర్ నాగరాజుకు ఏఈగా పదోన్నతి రావడంతో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ట్రానన్స్‌కో ఉద్యోగులు ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సబ్ ఇంజినీర్ నాగరాజు ఈవోగా పదోన్నతి పొంది గాంధారి మండలం సర్వాపూర్ కు బదిలీ అయ్యారు. ట్రాన్స్‌కో సిబ్బంది సురేందర్, ఈశ్వర్, మున్యా, విఠల్, కమలాకర్, వెంకట్, నసీర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పంటల పరిశీలన
తాడ్వాయి: మండలంలోని ఎర్రాపహాడ్ శివారులో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను ఏవో నర్సింలు శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంటలో యాజమాన్య పద్ధతులు, మొక్కజొన్నపంటలో కత్తెర పురుగు ఉధృతి నివారణ కోసం, ఎదుగుదల లోపించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఆయన వెంట ఏఈవో శివచైతన్య, రైతులు ఉన్నారు.
పత్తి పంటలో ప్యారావిల్ట్ తెగుళ్లు
మద్నూర్(జుక్కల్): ప్యారావిల్ట్ అనేది పత్తి పంటలో వచ్చే శారీరక రుగ్మత అని ఇది ఫంగస్, బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధి కాదని ఏఈవో అనిల్ పేర్కొన్నారు. మండలంలోని అంతాపూర్ శివారులోని పత్తి పంటను శనివారం ఏఈవో అనిల్ రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు మొక్క వేర్లు తగినంత నీటిని, పోషకాల పై భాగాలకు అందించలేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందన్నారు. ఆకులు పచ్చగానే ఉండి కిందికి వాలి పోవచ్చన్నారు. మధ్యాహ్నం వాడిపోవడం, సాయంత్రం కొలుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ప్యారావిల్ట్ నివారణకు కాపర్ ఆక్సిక్లోరైడ్(సీఓసీ) అనే మందును లీటర్ నీటికి 3 గ్రాములు కలిపి ఎక్కడైతే ఈ ప్యారావిల్ట్ కి గురైన మొక్క దాని చుట్టుపక్కల ఒక ఐదుఆరు మొక్కల మొదలు దగ్గర వేరు భాగం తడిసేటట్టు పంపు యొక్క ముందరి నాజిల్ భాగం తీసివేసి డ్రెచింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో రైతులు ఉన్నారు.


