ఏర్పాట్లు పూర్తి..
దోమకొండ: మండల కేంద్రంలోని చాముండేశ్వరిమాత భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా నిలుస్తోంది. రాష్ట్రంలో సికింద్రాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మహంకాళి ఆలయంగా పేరుగాంచిన ఈ గుడి నిర్మాణం చేపట్టి ఆదివారంతో 55 ఏళ్లు పూర్తవనున్నాయి. ఈసందర్భంగా ఆలయం రేపటి నుంచి నిర్వహించే ఉత్సవాలకు ముస్తాబైంది.
చారిత్రక నేపథ్యం..
దోమకొండ సంస్థానానికి చెందిన కామినేని వంశీయులు ఈ ఆలయాన్ని 1943–46 మధ్య కాలంలో నిర్మించినట్లు చర్రిత చెబుతుంది. ఆలయంలోని అమ్మవారి ప్రతిమ రాక్షసులను సంహరించే రూపంలో ఉండి భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారికి ఉన్న 18 చేతుల్లో ప్రతి చేతిలో ఒక ఆయుధం కలిగి ఉండటం విశేషం.
బోనాల ఊరేగింపు ప్రత్యేకం..
యాభై ఐదు ఏళ్లుగా అమ్మవారికి బోనాలు ఊరేగింపు ఘనంగా జరుగుతోంది. పోతరాజుల విన్యాసాలు, ఘటం ఊరేగింపు, రంగం ఎక్కడం కార్యక్రమాలు ఉంటాయి. గ్రామానికి చెందిన దాదాపు 4వేల మంది మహిళలు అమ్మవారికి బోనాలు తీస్తారు. ఉత్సవాలకు దోమకొండ, కామారెడ్డి ప్రాంతంతో పాటు సిద్దిపేట, నిజామాబాద్, సిరిసిల్లా, హైద రాబాద్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు.
ఆదివారం జరిగే బోనాల ఉత్సవాలకు ఆలయంను సిద్ధం చేశాం. ఆలయంలో ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు బోనాలు, నైవేద్యం సమర్పణ నిర్వహించనున్నారు. వేలాది మంది భక్తులు పాల్గొననుండటంతో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం. –భావి శరత్ చంద్రశర్మ,
ఆలయ అర్చకులు, దోమకొండ
దోమకొండలో అమ్మవారిని
ప్రతిష్ఠించి నేటికి 55 ఏళ్లు
బోనాల పండుగకు
ముస్తాబైన ఆలయం


