
క్రైం కార్నర్
చెరువులో మునిగి యువకుడి మృతి
ఎల్లారెడ్డి: మండలంలోని లక్ష్మాపూర్ గ్రామ శివారులో గల ఊర చెరువులో ఓ యువకుడు నీట మునిగి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వివరాలు ఇలా.. జాన్కంపల్లి ఖుర్దు గ్రామానికి చెందిన మూడ్ పూల్యా(45) జీపీ మల్టీపర్పస్ వర్కర్‌గా విధులను నిర్వహిస్తుండేవాడు. గ్రామంలోని ఊర చెరువు మీదుగా వచ్చే విద్యుత్ తీగలు తెగిపోవడంతో గ్రామానికి చెందిన విద్యుత్ శాఖ లైన్‌మెన్, విద్యుత్ ఆపరేటర్లు చెరువులోని విద్యుత్ స్తంభానికి మరమ్మతుల కోసం పూల్యాను తీసుకువెళ్లారు. ప్రమాదవశాత్తు పూల్యా నీటిలో మునిగి మృతి చెందడంతో లైన్‌మెన్, ఆపరేటర్లు పూల్యా మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం వారు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిపారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.
చికిత్స పొందుతూ ఒకరు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వివరాలు ఇలా.. మండలంలోని తాండూర్‌కు చెందిన బోరంచ లచ్చయ్య (20)కు భార్య లావణ్యతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో ఆమె రాఖీపండగ సందర్భంగా బాన్సువాడలోని తన పుట్టింటికి వెళ్లింది. అంతకుముందు ఆమె భర్త లచ్చయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడు మనస్తాపం చెంది ఈ నెల 12న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని చికిత్స నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీఆస్పత్రికి తరలించగా బుధవారం రాత్రి చికిత్స పొందుతూ లచ్చయ్య మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు.
చీనూర్‌లో మరొకరు..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని చీనూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఎస్సై భార్గవ్‌గౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన దాసరి సంజీవులు(47) కొన్ని రోజుల క్రితం ఆర్థికపరమైన విషయమై కుటుంబసభ్యులతో గొడవపడ్డాడు. దీంతో మనస్తాపం చెంది అతడు ఈనెల 11న రాత్రి గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై వివరించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
వడ్లం గ్రామంలో..
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండలంలోని వడ్లం గ్రామంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందు తాగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. గ్రామనికి చెందిన మంతోల సుభాష్ (35) గురువారం సాయంత్రం సమయంలో మద్యంమత్తులో పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ వెళ్లాడు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి నిజామాబాద్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందినట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.
కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
భిక్కనూరు: మండల కేంద్రం సమీపంలోని టోల్‌ప్లాజా వద్ద ఉన్న కాలువలో గుర్తుతెలియని వ్యక్తి పడి మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై అంజనేయులు గురువారం తెలిపారు. సదరు వ్యక్తి వయస్సు 35 సంవత్సరాల వరకు ఉంటుందని, అతడు జాతీయ రహదారిపై అటుఇటు తిరిగేవాడని, ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెంది ఉంటాడన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.

క్రైం కార్నర్