
అన్న వెంటే తమ్ముడు
● సోదరుని మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో మృతి
వేల్పూర్: అన్న మరణాన్ని తట్టుకోలేక తమ్ముడు గుండెపోటుకు గురై మరణించిన ఘటన శుక్రవారం వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దివంగత రిటైర్డ్ టీచర్ అయ్యవార్ల మురళీధర్‌రావుకు భార్గవ్‌శ్యాం, ప్రేమ్‌కుమార్, విజయ్‌కుమార్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దకొడుకు భార్గవ్‌శ్యాం ప్రైవేటు కంపెనీలో పనిచేసుకుంటూ చాలా ఏళ్లుగా మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నివాసముంటున్నాడు. ప్రేమ్‌కుమార్ కలకత్తాలో ఉంటుండగా, విజయ్‌కుమార్ అంక్సాపూర్‌లో ఇంటి వద్దనే ఉండేవాడు. భార్గవ్ శ్యాం(57) కొద్దికాలంగా పక్షవాతంతో బాధపడుతూ గురువారం రాత్రి మరణించాడు. ఆయన మరణవార్తను శుక్రవారం ఉదయం అంక్సాపూర్‌లో ఉన్న తమ్ముడు విజయ్‌కుమార్‌కు తెలిపారు. దీంతో విజయ్‌కుమార్ తీవ్ర మనస్తాపం చెంది గుండెపోటుకు గురయ్యాడు. గ్రామస్తులు వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. భార్గవ్‌శ్యాం అంత్యక్రియలు శుక్రవారం పూర్తికాగా, విజయ్‌కుమార్ అంత్యక్రియలు కలకత్తాలో ఉండే అన్న ప్రేమ్‌కుమార్ శనివారం ఇంటికి వచ్చిన తర్వాత నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అన్నదమ్ములు ఒకరివెంట ఒకరు మరణించడంతో గ్రామంలో విషాదం నెలకొంది.
రాజంపేట: వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడికి తీవ్రగాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన గుర్రాల రమేశ్ కొడుకు ధనుంజయ్(4) స్థానిక ప్రైవేటు పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3గంటలకు మూత్ర విసర్జన కోసం పాఠశాల ఆవరణలోకి వెళ్లగా వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. దీంతో ధనుంజయ్‌కి తీవ్రగాయాలయ్యాయి. కుక్కలను తరిమే ప్రయత్నంలో ఓ ఉపాధ్యాయురాలిపై దాడికి యత్నించినట్లు తెలిసింది. విద్యార్థి ప్రస్తుతం కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండల కేంద్ర సమీపంలోని 161 జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మాడు సాయవ్వ శుక్రవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం 161 జాతీయ రహదారి దాటుతుండగా పిట్లం నుంచి బిచ్కుంద వైపు వెళుతున్న కారు ఢీకొట్టింది. సాయవ్వకు గాయాలు కాగా స్థానికులు 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పతిరికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సాయవ్వను మెరుగైన వైద్యం కోసం బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అన్న వెంటే తమ్ముడు