అన్నవరం: ఆషాఢ బహుళ దశమి, శనివారం కావడంతో అన్నవరం శ్రీవీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం శనివారం భక్తులతో కిక్కిరిసింది. సత్యదేవుని దర్శనానికి రెండు గంటలు, రూ.200 టిక్కెట్‌తో అంతరాలయ దర్శనానికి గంట సమయం పట్టింది. రూ.300 వ్రతా లు ఆచరించేందుకు భక్తులు వ్రత మండపాల వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి వ్రతాలు రెండు వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరింది. ఐదు వేల మందికి అన్నప్రసాదం అందించారు. కాగా, ఆ షాఢ బహుళ ఏకాదశి సందర్భంగా ఆదివారం కూడా రత్నగిరిపై రద్దీ నెలకొనే అవకాశం ఉంది. ఆలయ ప్రాకారంలో ఉదయం 10 గంటల నుంచి టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవారిని ఊరేగిస్తారు.
ఏలేరు తీరంలో
విహారయాత్రలు నిషిద్ధం
జగ్గంపేట: భావవరం గ్రామ సమీప అటవీ ప్రాంతంలోని ఏలేరు ప్రాజెక్టు నదీ తీరంలో విహార యాత్రలకు ఎటువంటి అనుమతులు లేవని, ఈ ప్రాంతాన్ని నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపారు. కొంత కాలంగా ఈ ప్రాంతానికి పర్యాటకుల సందడి పెరిగింది. వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం జరగడంతో సెలువు రోజుల్లో పెద్ద ఎత్తున వస్తు న్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కళాశాలకు చెందిన విద్యార్థులు విహారయాత్రకు వచ్చి ఓ యువకుడు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఈ ప్రాంతంలో నది బాగా లోతుగా ఉండడంతో నీటిలో దిగితే ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. అంతేకాకుండా రిజర్వ్ ఫారెస్టులోకి రావడానికి కూడా నిబంధనల ప్రకారం వీలుకాదని చెప్పారు. భావవరం ప్రాంతంలో నిషేధిత ప్రాంతంగా బోర్డులు ఏర్పాటు చేశామన్నారు.
చేనేత అభివృద్ధికి
రూ.10 కోట్లతో ప్రతిపాదన
కొత్తపల్లి: నేషనల్ లెవెల్ ప్రోగ్రాం అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఎస్‌పీడీ)లో భాగంగా చేనేత అభివృద్ధికి రూ.10 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. శనివారం ఉప్పాడలో ఆయన పర్యటించారు. జాంధాని చీరల తయారీ విధానాన్ని పరిశీలించారు. అక్కడి చేనేత సహకార సంఘంలో పలు రకాల చేనేత చీరలను చూశారు. చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయాలను కార్మికులను అడిగి తెలుసుకొన్నారు. ఎన్‌ఎస్‌పీడీలో భాగంగా మార్కెట్లోకి వచ్చే కొత్త డిజైన్లపై కార్మికులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపడతున్నట్లు కలెక్టర్ వివరించారు. అదే విధంగా చేనేత రంగాన్ని మెరుగుపరిచేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఎంఓయూ చేసినట్లు తెలిపారు. ఆయన వెంట అసిస్టెంట్ కలెక్టర్ ప్రియ ఉన్నారు.
కట్టమూరులో
నీటి నమూనాల సేకరణ
పెద్దాపురం: కట్టమూరులో కలుషిత నీటి వల్ల చిన్నారులు రోగాల బారిన పడుతుండడంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అయ్యారు. పలువురు కామెర్లు, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న విషయాన్ని గమనించిన వైద్య ఆరోగ్య, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. శనివారం కట్టమూరులో అడిషనల్ డీఎంహెచ్‌ఓ ప్రశాంతి ఇతర వైద్య బృందం పర్యటించింది. గ్రామంలో వివిధ ప్రాంతాల్లో నీటి నమూనాలు సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. గ్రామంలో పరిస్థితులు చక్కబడే వరకు గ్రామస్తులు కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు.


