● ప్రభుత్వ చర్యలతో మహిళలకు
రక్షణ దూరం
● మాజీ ఎంపీ వంగా గీత
పిఠాపురం: దిశ బిల్లు రద్దు చేయడం దారుణమని, చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో మహిళలకు రక్షణ దూరమవుతుందని మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత మండిపడ్డారు. శనివారం పిఠాపురం మండలం ఎఫ్‌కే పాలెంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. గతంలో తాను ఎంపీగా ఉన్నప్పుడు దిశ బిల్లును చట్టం చేయాలని అప్పటి కేంద్ర మంత్రులను, రాష్ట్రపతిని కలసి కోరామన్నారు.
ప్రస్తుతం ఆ బిల్లు చట్టం కావడానికి చివరి దశలో ఉందని, అయినప్పటికీ చట్టం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు. అందుకే ఒక్క ఎంపీ కూడా ఇప్పటి వరకు పార్లమెంట్‌లో మాట్లాడడం లేదన్నారు. ప్రస్తుతం వచ్చిన క్రైం రిపోర్టుల్లో ఎక్కువగా మహిళలపై లైంగిక, చిన్న పిల్లలపై దాడులు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయన్నారు. దేశం మొత్తం మీద రాష్ట్రంలోనే మహిళలు, పిల్లలకు రక్షణ లేకుండా పోయిందనడానికి క్రైం రిపోర్టులే నిదర్శనమన్నారు.
ఇంత దారుణంగా అరాచకాలు జరుగుతున్నా, వాటిని కూడా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలు, పిల్లలకు రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. లేకుంటే వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. దిశ బిల్లును చట్టం చేసే వరకు ఉద్యమిస్తామన్నారు. మహిళలు క్షేమంగా సమాజంలో తిరిగే పరిస్థితి కల్పించాల్సిన ప్రభుత్వం దాడులు జరుగుతున్నా, పట్టించుకోకపోవడం దారుణమన్నారు.


