● పుంజుకొంటున్న పొగాకు ధర
● మాజీ సీఎం జగన్ రాకతో ‘ధర’హాసం
● రెండు రోజుల్లో కిలోకు రూ.16 పెంపు
రైతుల మోముల్లో ఆనందం
దేవరపల్లి: నాలుగు నెలలుగా నిలకడగా సాగిన పొగాకు ధర రెండు రోజులుగా పుంజుకొంటుంది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాకతో ‘ధర’హాసం వచ్చింది. ఈ నెల 5న మాజీ సీఎం వైఎస్ జగన్ దేవరపల్లిలో పర్యటించి రైతులకు బాసటగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన ఖరారైన తర్వాత కిలోకు రూ.10 ధర పెరగగా, పర్యటన అనంతరం శుక్రవారం రూ.15 పెరిగింది. శనివారం మరో రూ.1 పెరుగుదలతో మొత్తంగా కిలోకు రూ.26 పెరిగినట్టయ్యిందని రైతులు తెలిపారు. రెండు రోజుల్లోనే రూ.16 పెరగడం విశేషం.
తాజా ధరలు ఇలా..
శనివారం మార్కెట్‌లో కిలో గరిష్ట ధర రూ.291, కనిష్ట ధర రూ.150, సగటు ధర రూ.242.05 పలికింది. టొబాకో బోర్డు రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో శనివారం 4,645 బేళ్లు అమ్మకానికి రాగా, 2,239 బేళ్లు కొనుగోలు చేశారు. 2,406 బేళ్లు తిరస్కరించారు. 2.91 లక్షల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. ఇప్పటివరకు 13.18 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. దేవరపల్లి వేలం కేంద్రంలో 1.92 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం వేలం కేంద్రంలో 2.89 మిలియన్ల కిలోలు, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 3.12 మిలియన్ల కిలోలు, కొయ్యలగూడెం వేలం కేంద్రంలో 2.72 మిలియన్ల కిలోలు, గోపాలపురం వేలం కేంద్రంలో 2.51 మిలియన్ల కిలోల విక్రయాలు జరిగాయి. కిలో సగటు ధరలు దేవరపల్లిలో రూ.237.97, జంగారెడ్డిగూడెం–1లో రూ.242.97, జంగారెడ్డిగూడెం–2లో రూ.241.53, కొయ్యలగూడెంలో రూ.241.22, గోపాలపురంలో రూ.245.64 రైతులకు లభించాయి.
55 శాతం బేళ్ల తిరస్కరణ
వేలం కేంద్రాలకు తీసుకొచ్చిన బేళ్లను కొనుగోలు చేయకుండా ట్రేడర్లు తిరస్కరించడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తిరస్కరించిన బేళ్లు తిరిగి ఇంటికి తీసుకువెళ్లాలంటే ఆర్థికంగా నష్టపోతున్నారు. బేలుకు దూరాన్ని బట్టి రూ.100 నుంచి రూ.150 ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. తీసుకొచ్చిన బేళ్లలో 55 శాతం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 నుంచి 45 శాతం బేళ్లు అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. ధర పెరిగినప్పటికీ నో బిడ్‌లు ఎక్కువగా ఉంటున్నాయని వారు గగ్గోలు పెడుతున్నారు. ధరతో పాటు పొగాకు కొనుగోలు శాతం కూడా పెరగాలని రైతులు కోరుతున్నారు.


