● తాగునీరు కలుషితంతోనే రోగాలు
● సీహెచ్‌సీలో రోగులను
పరామర్శించిన దొరబాబు
సామర్లకోట: కలుషిత నీటి కారణంగా సామర్లకోటలో అనేక మంది రోగాల బారిన పడుతున్నా, ఇంకా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబు మండిపడ్డారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పచ్చ కామెర్లు, జ్వరం, కడుపు నొప్పితో చికిత్స పొందుతున్న రోగులను శనివారం ఆయన పరామర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్యంపై వైద్యులు కేఎస్‌ఎన్‌ఎస్‌ఎం కార్తీక్, వి.చంద్రకళాదేవి, పి.సుజాత, శివజ్యోతిలను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అవసరమైన వారిని కాకినాడకు తరలించాలని దొరబాబు సూచించారు. అనంతరం రోగుల కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. దొరబాబు మాట్లాడుతూ కలుషిత జలాలు సరఫరా కావడానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలన్నారు. వారం రోజులుగా వివిధ రోగాలతో అనేక మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. సీహెచ్‌సీ సమీపంలో శుక్రవారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారని, అయితే ఇక్కడ రోగులను పరామర్శించకపోవడంపై శోచనీయమన్నారు.
రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతుందని, శనివారం కూడా మరో ఐదుగురు జ్వరాలతో ఆస్పత్రిలో చేరారని తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ సీపీ నాయకులు ఆస్పత్రికి చేరుకుని అధికారులను ప్రశ్నించడంతోనే అంతా దిగి వచ్చారని అన్నారు. వారం రోజుల క్రితం డీజిల్ లేకపోవడం వల్ల ఫిల్టర్ బెడ్‌లో జనరేటర్ పనిచేయలేదని, డీజిల్‌కు కూడా నిధులు ఖర్చు చేయలేని స్థితిలో ఉన్నారని తెలిపారు. ఫిల్టర్ చెరువులో చేపల వేటకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. మున్సిపాలిటీ నుంచి బురద, పసరు రంగులో నీరు రావడం కారణంగానే రోగాలు ప్రబలుతున్నాయని జిల్లా మానవ హక్కుల సంఘ అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ ఆరోపించారు. వైఎస్సార్ సీపీ అయ్యరక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఉబా జాన్‌మోజెస్, కోఆప్షన్ మాజీ సభ్యుడు మన్యం చంద్రరావు, నేతలు పాగా సురేష్‌కుమార్, నేతల హరిబాబు, సేపెని సురేష్, కరణం రాజ్‌కుమార్, చిట్టుమాని శ్రీనివాసరావు, ఇరుసుమళ్ల సాయి, లింగం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


